Raghu Rama Krishna Raju: దొంగ ఓట్లు నిర్మూలిస్తే మా పార్టీ ఔట్: రఘురామకృష్ణరాజు
- ప్రభుత్వ తప్పులు, మోసాలను పతాక శీర్షికల ద్వారా ఎండగడుతున్న రామోజీరావు అంటూ కితాబు
- రామోజీరావు గారికి మనోధైర్యాన్ని ఇచ్చేందుకు ప్రజలంతా అండగా ఉండాలని వ్యాఖ్య
- ముఖ్యమంత్రి గారికి ఇసుకాసుర అనే పేరు పెట్టాలేమోనని ఎద్దేవా
- కేశవ్ గారి స్ఫూర్తితో దొంగ ఓట్ల నిర్మూలనకు కృషి చేయాలని పిలుపు
మన ఓట్లను మనం రక్షించుకుంటూ దొంగ ఓట్లను నిర్మూలిస్తే వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఔట్ అవుతుందని వైసీపీ అసంతృప్త ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. దొంగ ఓట్లపై ఆధారపడే తమ పార్టీ నాయకులు విజయంపై నమ్మకంతో ఉన్నారన్నారు. దొంగ ఓట్ల నిర్మూలనపై కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసిన శుభవార్తను విన్నామన్నారు. మున్ముందు ఇలాంటి మరిన్ని శుభవార్తలు వింటామన్నారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా అనుసంధాన వేదిక ఫేస్‌బుక్‌లో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.
సోమవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... మార్గదర్శి సంస్థపై గత ఐదు రోజులుగా జగన్ దిశా నిర్దేశంతో కొనసాగుతున్న వేధింపు దాడులపై కోర్టు మధ్యంతర స్టే విధిస్తూ, రెండు రోజుల పాటు బ్రేక్ వేస్తూ మధ్యంతర స్టే ఇచ్చిన న్యాయస్థానం, రెండు రోజుల అనంతరం శాశ్వత స్టే ఇచ్చే అవకాశాలు లేకపోలేదన్నారు. గతంలోనూ న్యాయస్థానాలు ఇచ్చిన ఉత్తర్వులను వక్రీకరించి, చందాదారులను ఫిర్యాదు ఇవ్వమని ఒత్తిడి చేసి, పోలీసులు తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని, దొంగ ఫిర్యాదులు ఇవ్వమని చందాదారులపై అనేక ఒత్తిళ్లు చేసినప్పటికీ, పోలీసులు నమోదు చేసిన కేసులు న్యాయస్థానం ముందు నిలబడలేదని అన్నారు.
తాజాగా నమోదు చేసిన కేసులోనూ బ్రాంచ్ మేనేజర్లను అరెస్టు చేసి కస్టడీకి ఇవ్వాలని కోరారని, అయినా న్యాయస్థానం నిరాకరించిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మరో మారు స్పష్టం అయ్యిందని అన్నారు. పోలీసు వ్యవస్థను ఈ పాలకులు దారుణంగా దుర్వినియోగం చేస్తున్నారని, ఒక రాజకీయ నాయకుడు చెప్పాడని, ఐపీఎస్ పాస్ అయిన అధికారులు కూడా తింగరి చేష్టలకు పాల్పడుతున్నందుకు సిగ్గుపడాలని, వీరు ఐపీఎస్ ఎలా పాస్ అయ్యారో అర్థం కావడం లేదన్నారు. ఐపీఎస్ అధికారులు కూడా చట్టంలోని నిబంధనలు పాటించకపోవడం దుర్మార్గమన్నారు. ఇలాంటి వెధవ పనుల్లో పాలుపంచుకుంటున్నందుకు తమను చూసి తామే సదరు అధికారులు సిగ్గుపడాలన్నారు.
ప్రభుత్వ తప్పులు, మోసాలను పతాక శీర్షికల ద్వారా ఎండగడుతున్న రామోజీరావు...
ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మోసాలను, తప్పులను ఈనాడు దినపత్రిక ద్వారా పతాక శీర్షికలతో ఎండగడుతున్నారనే అక్కసుతోనే రామోజీరావుని వేధిస్తున్నారని, రామోజీరావు వ్యాపార సంస్థలపై కొనసాగుతున్న ఈ దుర్మార్గపు, దుష్ట దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని, వి ఆర్ విత్ యు రామోజీరావు అంటూ నినదించాలని అన్నారు. ప్రస్తుతం వి ఆర్ విత్ యు రామోజీరావు అనే హ్యాష్ ట్యాగ్ తో నెటిజన్లు నినదిస్తున్న నినాదం ట్విట్టర్ లో ఆల్ ఇండియా ట్రెండింగులో కొనసాగుతోందని, ఈ తింగరి వేషాలను ఇలాగే రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తే ప్రజా ఉద్యమంగా మారే అవకాశం ఉందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ముందుండి వార్తలు రాస్తున్న ఈనాడు దినపత్రిక, తమ సాక్షి దినపత్రికకు అడ్డుగా ఉన్నదని, రామోజీరావు గారి నేతృత్వంలోని మార్గదర్శి సంస్థపై జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పదేపదే దాడులు నిర్వహిస్తోందని అన్నారు.
మార్గదర్శి సంస్థ ఏ తప్పు చేయకపోయినప్పటికీ, ఆ సంస్థ శాఖలు నిర్వహిస్తున్న భవంతుల, భవన నిర్మాణ అనుమతులను పరిశీలించడం, సక్రమంగా ఉన్నాయా లేదా అని వేధించడం, ఇంటి పన్ను సకాలంలో చెల్లించారా అని ప్రశ్నించి వేధించడం, అగ్నిమాపక దళ శాఖ అనుమతులన్నీ ఉన్నాయా అంటూ భవన యజమానులను సంబంధిత శాఖల అధికారులు ప్రశ్నించే వేధింపులకు దిగడం దారుణం అని అన్నారు. ఇన్ని నెలలుగా ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ మార్గదర్శి సంస్థపై ఎటువంటి కేసు నమోదు చేసే అవకాశాలు లేకపోవడంతో, చందాదారుల ఇంటికి వెళ్లి వారిని బ్రతిమాలి ఫిర్యాదులను చేయించుకునే స్థాయికి రాష్ట్ర ప్రభుత్వం దిగజారిందని రఘురామకృష్ణ రాజు అన్నారు.
ముఖ్యమంత్రికి ఇసుకాసుర అనే పేరు పెట్టాలేమో...
ముఖ్యమంత్రి జగన్ కు ఇసుకాసుర అనే పేరు పెట్టాలేమోనని ప్రజలు భావిస్తున్నారని రఘురామకృష్ణ రాజు అన్నారు. జేపీ అనే సంస్థకు ఇసుక తవ్వకాల కాంట్రాక్టుని అప్పగించగా, మే 9వ తేదీనే ఆ కాంట్రాక్టు గడువు కాలం ముగిసిందని, ఆ సంస్థ కాంట్రాక్టులు కూడా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిందని, అయినా టర్న్ కి అనే సంస్థ పేరిట రసీదులను కట్ చేస్తూ, జిల్లాకు 20 నుంచి 25 కోట్ల రూపాయల అనధికారిక ప్రయివేట్ బిడ్ ద్వారా ఇసుక తవ్వకాలను కొంత మంది ప్రైవేటు వ్యక్తులు యథేచ్చగా కొనసాగిస్తున్నారని తెలిపారు.
ఇసుక తవ్వకాల ద్వారా తాడేపల్లి ప్యాలెస్ కు ప్రతినెల 250 నుంచి 300 కోట్ల రూపాయల వ్యక్తిగత ఆదాయం వెళ్తోందని, ప్రైవేట్ బిడ్ ఈ రేంజ్ లో ఉందని ప్రజలు మాట్లాడుకుంటున్నారని, ఎన్ జి టి తో పాటు న్యాయస్థానాలలో కేసులు వేయగా, చిత్తూరు జిల్లాలోని 10 ఇసుక ర్యాంపులతో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా ఇసుకతవ్వకాలను ఆపాలని కోర్టు ఆదేశించడం జరిగిందన్నారు. ఎన్జీటీలో కేసు వేసిన వ్యక్తిపై మరో కేసు నమోదు చేసి అరెస్టు చేశారని, అయినా ప్రభుత్వానికి న్యాయస్థానాలంటే గౌరవం లేదని, పోనీ జేపీ సంస్థకు ఇసుక కాంట్రాక్ట్ రెన్యువల్ చేశారా? అంటే అది లేదన్నారు.
ప్రభుత్వం కూడా ఈ విషయంలో స్పష్టతను ఇవ్వదని, ఇసుక అక్రమ తవ్వకాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడితే, ఆయనకు మూడు పెళ్లిళ్లు అయ్యాయని ఎదురు దాడి చేస్తూ, చెత్త చెత్త మాటలను ప్రభుత్వ పెద్దలు మాట్లాడిస్తున్నారన్నారు. విష్ణు పాదాలు ఉన్న కొండపై తమ ప్రాంతీయ పార్టీ జాతీయ కార్యదర్శి కన్నేసినట్లు తెలిసిందని, విద్యాలయాలు స్థాపించడానికి ఆ కొండకు కూడా గుండు కొట్టనున్నారన్నారు. రాష్ట్రంలోని ఇసుక మట్టి దోచేశారని, చెత్త సరుకుతో ప్రజల ఆరోగ్యాన్ని హరించి వేస్తున్నారని, కాసింత స్తోమత ఉన్నవారు రాష్ట్రాన్ని వదిలి పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్తున్నారని, ఇదేమిటని ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. అయినా సరే రామోజీరావు, రాధాకృష్ణ, రాజగోపాల్ నాయుడు వంటి వారు ఈ ప్రభుత్వ దమన కాండను ప్రశ్నిస్తే సూటి పోటి మాటలు అంటున్నారన్నారు. అయినా ఈ ముగ్గురు Rలతో పాటు RRR అయిన తానూ తగ్గేది లేదన్నారు. ఏదో రకంగా తమను వేధించే ప్రయత్నాలను ఈ ప్రభుత్వం చేస్తుందన్నారు.
జేపీ సంస్థ కాంట్రాక్ట్ గడువు కాలం ముగిసినప్పటికీ ఇసుక తవ్వకాల పేరిట దోచుకుంటున్నారంటే, గత మూడున్నర ఏళ్లుగా ఎంత దోచుకున్నారో ప్రజలకు అర్థమవుతూనే ఉందని, ఇసుక తవ్వకాల ద్వారా తాము దోచుకుంటున్నామని ప్రజలకు స్పష్టంగా తెలియజేసిన ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్నీ అభినందించాలని, ఇది బరితెగింపు కాకపోతే మరేమిటి అని రఘురామకృష్ణ రాజు ప్రశ్నించారు.
కేశవ్ స్ఫూర్తితో దొంగ ఓట్ల నిర్మూలనకు కృషి చేయండి...
ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ స్ఫూర్తితో దొంగ ఓట్ల నిర్మూలనకు ప్రతిపక్ష పార్టీల నేతలు అంతా కృషి చేయాలని రఘురామకృష్ణ రాజు కోరారు. ఉరవకొండలో దొంగ ఓట్ల నమోదు ప్రక్రియ వ్యవహారాన్ని పయ్యావుల కేశవ్ గారు కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువచ్చారని, ఈ విషయాన్ని తాను కూడా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు నివేదించానని, దాదాపు 6 నుంచి 10 వేల దొంగ ఓట్లను కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు గుర్తించి నిర్మూలించారని తెలిపారు. ఈ దారుణానికి పాల్పడ్డ పక్షపాత అధికారి సుబ్బారెడ్డిని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసిందని, అటువంటి అధికారిని సస్పెన్షన్ చేయడం కాదు, సర్వీసు నుంచి తొలగించాలని అన్నారు.
గతంలో జెడ్పిసీఈఓ గా పనిచేసిన స్వరూపారాణి దొంగ ఓట్ల నమోదుకు అంకురార్పణ చేశారని, ఆమెను కూడా సస్పెండ్ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించిందని తెలిపారు. దీనితో దొంగ ఓట్ల నమోదుకు సహకరించిన ఇద్దరు అధికారులపై వేటు పడిందని, ప్రభుత్వ పెద్దలు చెప్పారని తప్పుడు పనులు చేసే అధికారులు ఎవరికైనా ఇదే శిక్ష తప్పదు అని అన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వం మారడం ఖాయమని, దుష్టులతో సావాసం చేసే అధికారులకు తిప్పలు తప్పవని హెచ్చరించారు. ఓట్ల నమోదు ప్రక్రియలో తమ పార్టీ ఎంత ఫ్రాడ్ చేసిందో స్పష్టంగా తేటతెల్లమయిందని రఘురామకృష్ణ రాజు గారు పేర్కొన్నారు. పయ్యావుల కేశవు గారిని స్ఫూర్తిగా తీసుకొని దొంగ ఓట్ల నమోదుపై పూర్తి ఆధారాలతో ఫిర్యాదు ఇవ్వండని, అలాగే తనకు కూడా ఒక కాపీ ఇస్తే, కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసి చర్యలు తీసుకోవాలని తాను కూడా కోరుతానని రఘురామకృష్ణ రాజు తెలిపారు.