Indigo Airlines: ఇండిగో విమానంలో రక్తం కక్కుకుని చనిపోయిన ప్రయాణికుడు
- ముంబై నుంచి రాంచీ వెళుతున్న విమానంలో సోమవారం సాయంత్రం ఘటన
- నాగ్‌పూర్‌లో విమానం అత్యవసర ల్యాండింగ్, బాధితుడిని కిమ్స్ ఆసుపత్రికి తరలింపు
- అప్పటికే ప్రయాణికుడు మృతిచెందినట్టు వైద్యుల ప్రకటన
- బాధితుడు సీకేడీ, క్షయతో సతమతమవుతున్నట్టు వెల్లడి
ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు రక్తం కక్కుకుని మరణించారు. ముంబై నుంచి రాంచీకి బయలుదేరిన విమానంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన సంభవించింది. సీకేడీ, క్షయతో సతమతమవుతున్న 62 ఏళ్ల ప్రయాణికుడు ఒకరు అకస్మాత్తుగా రక్తం కక్కుకున్నారు. దీంతో, పైలట్ విమానాన్ని ఎమర్జెన్సీగా నాగ్‌పూర్‌లో దించేశాడు.
ఎయిర్‌పోర్టు నుంచి బాధితుడిని సమీపంలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. కాగా, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తరలించారు. కిమ్స్ ఆసుపత్రి బ్రాండింగ్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ డీజీఎం ఎజాష్ షామీ ఈ వివరాలను వెల్లడించారు.