Prakash Javadekar: బీఆర్ఎస్ పాలనలో అవినీతి, విశ్వాసఘాతుకం తప్ప ఏముంది?.. బీజేపీ తెలంగాణ ఇన్చార్జ్ ప్రకాశ్ జవదేకర్ ఫైర్
- నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో కేసీఆర్ మోసం చేశారని జవదేకర్ ఆగ్రహం
- రాష్ట్రంలో కుటుంబ పాలన తీసుకొచ్చారని మండిపాటు
- ప్రభుత్వం చేస్తున్న అప్పులకు లెక్కే లేదని విమర్శ
- కేటీఆర్, కవిత, హరీశ్‌రావు, సంతోష్‌కు తప్ప మరెవరికీ ఉద్యోగాలు రాలేదని విమర్శ
- ఈ నెల 27న బీజేపీలో పెద్ద సంఖ్యలో చేరికలు ఉంటాయన్న జవదేకర్
తెలంగాణలోని అధికార బీఆర్ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ జవదేకర్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో అవినీతి, విశ్వాసఘాతుకం తప్ప ఏముందని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఇతర నేతలతో కలిసి నిన్న విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో సీఎం కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. మొత్తంగా కుటుంబ పాలన తీసుకొచ్చారని విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 18 లక్షల ఎకరాలకు నీళ్లిస్తామని చెప్పి లక్ష ఎకరాలకు మాత్రమే సాగునీరు ఇచ్చారన్నారు. తెలంగాణకు నీళ్లొస్తాయన్న ఉద్దేశంతో తాను కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు 15 రోజుల్లోనే ప్రాజెక్టుకు అనుమతి మంజూరు చేసినట్టు గుర్తు చేశారు. రూ. 40 వేల కోట్ల అంచనాతో ప్రాజెక్టును ప్రారంభించి చివరికి రూ.1.20 లక్షల కోట్లు ఖర్చు చేశారని విమర్శించారు.
అప్పులకైతే లెక్కేలేదని, ప్రభుత్వం రూ. 3.61 లక్షల కోట్లు అప్పు చేస్తే, ప్రభుత్వ గ్యారెంటీ అప్పులు రూ. 1.55 లక్షల కోట్లకు చేరాయని వివరించారు. కేసీఆర్ కుటుంబంలో కేటీఆర్, కవిత, హరీశ్‌రావు, సంతోష్‌కు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని, మరెవరికీ రాలేదని మండిపడ్డారు. ఈ నెల 27న బీజేపీలో పెద్దసంఖ్యలో నేతలు చేరబోతున్నట్టు ప్రకాశ్ జవదేకర్ తెలిపారు.