BRS: మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందనే నన్ను పక్కన పెట్టారు: రేఖా నాయక్
- ఖానాపూర్ లో తన సత్తా ఏంటో చూపిస్తానన్న ఎమ్మెల్యే
- బీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంపై తీవ్ర అసంతృప్తి
- అగ్రవర్ణాలకే పదవులు కట్టబెడుతున్నారని విమర్శ
మూడోసారి గెలిస్తే మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే తనను పక్కన పెట్టారని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ మంగళవారం పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రకటించిన పార్టీ అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంపై రేఖా నాయక్ స్పందించారు. పార్టీ ప్రకటించిన ఖానాపూర్ అభ్యర్థి జాన్సన్ నాయక్ అసలు ఎస్టీనే కాదని ఆరోపించారు. ఖానాపూర్ లో తన సత్తా ఏమిటో చూపిస్తానని పరోక్షంగా పార్టీ అధిష్ఠానానికి సవాల్ విసిరారు. పార్టీలో, ప్రభుత్వంలో అగ్ర వర్ణాలకే పదవులు కట్టబెడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల లిస్ట్ ను బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో చోటు దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఆశావహులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందులో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ పార్టీపై ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. టికెట్ దక్కకపోవడంతో ఎమ్మెల్యే కాంగ్రెస్ లోకి వెళతారని ప్రచారం జరుగుతోంది. దీనికి మరింత ఊతమిచ్చేలాగా రేఖా నాయక్ భర్త సోమవారం సాయంత్రమే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తాజాగా మంగళవారం ఉదయం ఎమ్మెల్యే రేఖా నాయక్ స్పందిస్తూ.. నియోజకవర్గ ప్రజలు, తన అనుచరులను సంప్రదించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని పేర్కొన్నారు.