Kottu Satyanarayana: దేవాదాయ భూముల స్వాధీనానికి ఆర్డినెన్స్ తీసుకువచ్చాం: మంత్రి కొట్టు సత్యనారాయణ
- దేవాదాయ భూములు కబ్జాకు గురికాకుండా చర్యలు తీసుకుంటామన్న మంత్రి
- దేవాదాయ శాఖ కింద 4.6 లక్షల ఎకరాల భూమి ఉందని వెల్లడి
- 1.65 లక్షల ఎకరాల వాణిజ్య స్థలం ఆక్రమణలో ఉందని వివరణ
రాష్ట్రంలో దేవాదాయ భూములు కబ్జాకు గురికాకుండా చర్యలు తీసుకుంటున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. దేవాదాయ శాఖ కింద 4.6 లక్షల ఎకరాల భూమి ఉందని, 1.65 లక్షల గజాల వాణిజ్యపరమైన స్థలం ఆక్రమణలో ఉందని వెల్లడించారు. దేవాదాయ శాఖ భూముల స్వాధీనానికి ఆర్డినెన్స్ తీసుకువచ్చామని తెలిపారు.
ఇక, రాష్ట్రంలో రూ.5 లక్షల ఆదాయం ఉండే 23,600 ఆలయాలు గుర్తించామని మంత్రి వెల్లడించారు. ఆలయ నిర్వహణ అప్పగిస్తామన్న ప్రకటనకు 37 దరఖాస్తులే వచ్చాయని పేర్కొన్నారు. ఆలయాల్లో ధూపదీప నైవేద్య నిర్వహణకు యథావిధిగా కార్యాచరణ ఉంటుందని అన్నారు.
ఏడాది పొడవునా ధర్మ ప్రచారం చేసేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. దేవాలయాల వారీగా సమీప ప్రాంతాల్లో ధర్మ ప్రచారం నిర్వహించనున్నట్టు వివరించారు. ధర్మ ప్రచారంలో స్థానిక కళాకారులకు చేయూత లభిస్తుందని స్పష్టం చేశారు.