Gautam Gambhir: ఇదో పనికిరాని చర్చ!: రవిశాస్త్రి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన గౌతమ్ గంభీర్
- తుది జట్టులో ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్లు ఉండాలన్న రవిశాస్త్రి వ్యాఖ్యలతో విభేదించిన గంభీర్
- మంచి ఫామ్ ఉన్నవారిని ఎంపిక చేయాలని సూచన
- ఒత్తిడిని తట్టుకొని ఆడేవారికి ప్రాధాన్యత ఇవ్వాలన్న గంభీర్
ఆసియా కప్, ప్రపంచ కప్ కోసం టీమిండియా తుది జట్టులో ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్లు ఉండాలన్న వాదనతో గౌతమ్ గంభీర్ విభేదించారు. ఇంతకంటే చెత్త సలహా మరొకటి లేదన్నారు. బ్యాటర్‌ది ఎడమ చేతి వాటమా? కుడి చేతి వాటమా? అన్నది సంబంధం లేదని, అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నవాళ్లను ఎంపిక చేస్తే సరిపోతుందన్నారు.
అంతకుముందు రవిశాస్త్రి మాట్లాడుతూ... తుది జట్టులో కనీసం ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్లు ఉంటే బాగుంటుందన్నారు. గత ఎనిమిది నెలలుగా ఇషాన్ కిషన్ తీరు గమనిస్తే, బ్యాటింగ్‌తో పాటు వికెట్ కీపింగ్ చేస్తున్నాడని, అతడితో పాటు మరో ఇద్దరు.. జడేజాను కూడా కలిపితే టాప్ 7లో ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటారన్నారు. ఇది జట్టుకు ఉపయోగకరమన్నారు.
ఈ వ్యాఖ్యలపై గంభీర్ స్పందించారు. జట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉండాలనేది చెత్త ఆలోచన అని, ఎందరు లెఫ్ట్ హ్యాండర్లు అనేది ముఖ్యం కాదని, ఫామ్ ముఖ్యమని అన్నారు. పరిస్థితులకు అనుగుణంగా ఒత్తిడిని తట్టుకొని ఆడేవారికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఎవరైనా బ్యాట్స్ మెన్ రాణిస్తే అతనిని కచ్చితంగా జట్టులోకి తీసుకోవాలన్నారు. లెఫ్ట్ హ్యాండర్ అనేది పనికి రాని చర్చ అన్నారు. తిలక్ వర్మ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్.. ఇలా ఎవరు ఫామ్‌లో ఉంటే వారిని ఎంచుకోవాలన్నారు. కానీ లెఫ్ట్ హ్యాండరే అంటే సరికాదన్నారు.