Dharmapuri arvind: ఒకవేళ బీజేపీకి ఓటు వేయవద్దనుకుంటే నోటాకు వేయండి: ధర్మపురి అర్వింద్
- గజ్వేల్లో ఓటమి భయంతోనే కేసీఆర్ కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్నారన్న అర్వింద్
- బీఆర్ఎస్, మజ్లిస్ దోస్తీ మైనార్టీలకే నష్టమని వ్యాఖ్య
- మోదీ పాలనలో ముస్లీంలకు భద్రత పెరిగిందన్న ఎంపీ
గజ్వేల్లో ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. నిజామాబాద్లో ఆయన నేడు కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... బీఆర్ఎస్, మజ్లిస్ దోస్తీతో మైనార్టీలకే నష్టమన్నారు. నరేంద్ర మోదీ పాలనలో ముస్లీంలకు భద్రత పెరిగిందని, బీజేపీకి వాళ్ల ఓటింగ్ కూడా పెరుగుతోందన్నారు. ఒకవేళ ఎవరైనా బీజేపీకి ఓటు వేయవద్దనుకుంటే నోటాకు వేస్తే సరిపోతుందన్నారు. ముస్లింలను కేసీఆర్ ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని విమర్శించారు.
నోటాకు ఓటు వేసినా, కారు గుర్తుకు ఓటేసినా, హస్తం గుర్తుకు ఓటేసినా తాను గెలవడం మాత్రం పక్కా అన్నారు. దేశవ్యాప్తంగా తాము 5 కోట్ల ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చామని, ఇప్పటికే మూడున్నర కోట్ల ఇళ్లు నిర్మించి ఇచ్చామన్నారు. మరో 50 లక్షల ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పారు. పేదలకు ఇచ్చే ఇళ్ల విషయంలో కేసీఆర్ సర్కార్ వెనుకబడి ఉందన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో మోసం చేస్తోందన్నారు.