Greg Chappell: సొంతగడ్డపై భారత్ పులి... ఇతర జట్లు జాగ్రత్తగా ఉండాలి: గ్రెగ్ చాపెల్
- గతంలో టీమిండియా కోచ్ గా వ్యవహరించిన చాపెల్
- ఈ ఏడాది భారత్ లో వన్డే వరల్డ్ కప్
- టీమిండియా అవకాశాలపై స్పందించిన మాజీ కోచ్
- అన్ని మ్యాచ్ ల్లో టీమిండియానే ఫేవరెట్ అని వెల్లడి
గతంలో టీమిండియా కోచ్ పదవి చేపట్టి వివాదాలకు కారణమైన ఆసీస్ క్రికెట్ దిగ్గజం గ్రెగ్ చాపెల్ ఈ ఏడాది భారత్ లో వరల్డ్ కప్ జరగనుండడంపై స్పందించాడు. సొంతగడ్డపై జరిగే వరల్డ్ కప్ లో టీమిండియానే ఫేవరెట్ అని స్పష్టం చేశాడు.
స్వదేశంలో భారత జట్టు ఎప్పుడూ పులేనని, ఇతర జట్లు జాగ్రత్తగా ఉండాలని తెలిపాడు. సొంతగడ్డపై ఎంతటి భారీ లక్ష్యమైనా టీమిండియా లెక్కచేయదని, ఆ జట్టును కట్టడి చేయాలంటే ఇతర జట్లు తీవ్రంగా చెమటోడ్చాల్సి ఉంటుందని పేర్కొన్నాడు.
తాను కోచ్ గా ఉన్న సమయంలో టీమిండియా ఇతర జట్లపై పైచేయి సాధించిందని, డ్రెస్సింగ్ రూంలో కూర్చుని భారత జట్టు ప్రదర్శనను చూడడం గొప్ప అనుభూతిని కలిగించేదని చాపెల్ వివరించాడు.
ఓవరాల్ గా, వన్డే వరల్డ్ కప్ లో అన్ని మ్యాచ్ ల్లో భారత జట్టే ఫేవరెట్ అని చాపెల్ పేర్కొన్నాడు.
భారత్ లో పరిస్థితులు ఆసియా జట్లకు అనుకూలించినా, గతంలో మాదిరి ఆసీస్, ఇంగ్లండ్ జట్లకు ఏమంత ప్రతికూలంగా ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. ఆసీస్, ఇంగ్లండ్ ఆటగాళ్లు ఐపీఎల్ లో ఎక్కువగా ఆడుతుండడంతో ఇక్కడి పిచ్ లు, వాతావరణ పరిస్థితులకు వారు అలవాటుపడ్డారని వివరించాడు.