Meerpet Gangrape Case: మీర్‌పేటలో బాలికపై లైంగికదాడి కేసు.. నిందితులందరూ అరెస్ట్
- ఇంట్లోకి దూసుకెళ్లి బాలికపై సామూహిక అత్యాచారం
- 24 గంటల్లోనే నిందితులకు సంకెళ్లు
- ప్రధాన నిందితుడిపై ఇప్పటికే 26 కేసులు
హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన మీర్‌పేట బాలిక సామూహిక లైంగికదాడి కేసులో నిందితులు ఏడుగురినీ పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశాకు చెందిన బాలిక తన ఇద్దరు తమ్ముళ్లతో కలిసి నగరానికి వచ్చి లాలాపేటలోని శాంతినగర్‌లో ఉంటోంది. వారం రోజుల క్రితం మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని నందనవనంలో ఉంటున్న వరుసకు సోదరి అయిన మహిళ వద్దకు వచ్చింది. మంగళహాట్ సీతారాంపేటకు చెందిన రౌడీషీటర్ అబేద్ బిన్ ఖలేద్ నందనవనంలో ఉంటున్న తన స్నేహితులు తహసీన్, మాంకాల మహేశ్, ఎం.నర్సింగ్, అష్రఫ్ వద్దకు వచ్చి వెళ్తుండేవాడు. ఈ క్రమంలో ఈ నెల 19న నందనవనం వచ్చిన అబేద్ బాలికను చూసి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ తర్వాత ఈ నెల 21న ఉదయం 11 గంటల సమయంలో తన స్నేహితులతో కలిసి బాలిక ఇంట్లోకి వెళ్లాడు.
ఆ సమయంలో బాలికతోపాటు ఆమె ఇద్దరు తమ్ముళ్లు మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఇంట్లోకి వచ్చీ రావడమే బాలికను బెడ్రూంలోకి ఈడ్చుకెళ్లి కత్తితో బెదిరించి అబెద్ బిన్, తహసీన్, మహేశ్ లైంగికదాడికి పాల్పడ్డారు. మిగతావారు ఆమె తమ్ముళ్లను బెదిరించి దూరంగా పంపించేశారు. విషయాన్ని బాలిక తన సోదరికి చెప్పింది. అందరూ కలిసి పోలీసులను ఆశ్రయించారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు త్వరితగతిన స్పందించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలించారు. కర్ణాటకలోని ఉమ్నాబాద్ వద్ద కొందరిని, హైదరాబాద్‌లో మరికొందరిని అరెస్ట్ చేశారు. మొత్తం ఏడుగురు నిందితులను 24 గంటల్లోనే అరెస్ట్ చేశామని, వారందరికీ కఠిన శిక్ష పడేలా చూస్తామని పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు. కాగా, ఈ కేసులో ప్రధాన నిందితుడైన అబేద్ బిన్ ఖలేద్(35)పై హత్యలు, హత్యాయత్నాలు, దోపిడీలు, దొంగతనాలు సహా 26 కేసులు నమోదై ఉన్నట్టు పేర్కొన్నారు.