Pakistan: చంద్రయాన్-3 మిషన్ కు పాక్ మాజీ మంత్రి ప్రశంసలు
- మొత్తం మానవాళికే చారిత్రాత్మక క్షణమని పొగడ్త
- పాకిస్థాన్ లోనూ ప్రత్యక్ష ప్రసారం చేయాలని డిమాండ్
- భారత సైంటిస్టులకు, ప్రజలకు అభినందనలు తెలిపిన ఫవాద్ చౌదరి
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన ప్రతిష్ఠాత్మక ప్రయోగం చంద్రయాన్-3 పై పాకిస్థాన్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి ప్రశంసల జల్లు కురిపించారు. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ అడుగిడే క్షణం భారతీయులకే కాదు మొత్తం మానవాళికే చారిత్రాత్మక క్షణమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలతో పాటు భారతీయులందరికీ ఫవాద్ అభినందనలు తెలిపారు. అదేవిధంగా, చంద్రయాన్-3 ల్యాండింగ్ ను పాకిస్థాన్ లోనూ ప్రత్యక్ష ప్రసారం చేయాలని అక్కడి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు ఫవాద్ చౌదరి మంగళవారం ట్వీట్ చేశారు.
ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో సమాచార, ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ఫవాద్ చౌదరి.. తాజాగా చంద్రయాన్-3 ప్రాజెక్టును మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. ఈ ప్రాజెక్టులో కీలక ఘట్టమైన విక్రమ్ ల్యాండింగ్ ను భారత్ లో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారని, పాకిస్థాన్ ప్రజలకు కూడా లైవ్ లో చూసే అవకాశం కల్పించాలంటూ పాకిస్థాన్ మీడియాకు ఫవాద్ విజ్ఞప్తి చేశారు.