Chandrayaan 3: చంద్రయాన్-3 ఘనత మాజీ ప్రధాని నెహ్రూదే: ఛత్తీస్ గఢ్ సీఎం
- నెహ్రూ ముందుచూపు వల్లే ఇప్పుడు చరిత్ర సృష్టించబోతున్నామని వ్యాఖ్య
- ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ సంస్థను స్థాపించారని వెల్లడి
- అదే ఇప్పుడు ఇస్రోగా రూపాంతరం చెందిందన్న భూపేశ్ బాఘెల్
చంద్రయాన్-3 ప్రాజెక్టు ఘనతంతా మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకే చెందుతుందని ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘెల్ పేర్కొన్నారు. దేశ తొలి ప్రధానిగా ఆయన ముందుచూపుతో వ్యవహరించడం వల్లే ఇప్పుడు ఈ ప్రాజెక్టు సాధ్యమైందని చెప్పుకొచ్చారు. ఈమేరకు మంగళవారం బాఘెల్ మీడియాతో మాట్లాడుతూ.. దేశ తొలి ప్రధాని నెహ్రూ చాలా ముందు చూపుతో వ్యవహరించారని పొగడ్తలు కురిపించారు. అంతరిక్ష పరిశోధనల కోసం 1962లో ఆయన ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ (ఐఎన్ సీఓఎస్ పీఏఆర్) ను స్థాపించారని చెప్పారు.
అదే ఇప్పుడు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గా రూపాంతరం చెందిందని వివరించారు. భారత అంతరిక్ష పరిశోధనలలో చంద్రయాన్-3 ప్రాజెక్టు గొప్ప విజయమని ఇస్రో శాస్త్రవేత్తలను భూపేశ్ బాఘెల్ అభినందించారు. శాస్త్రవేత్తల కృషితో పాటు ఈ ప్రాజెక్టు వెనక దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పాత్ర కూడా ఉందని చెప్పారు. చంద్రయాన్-3 ల్యాండింగ్ విజయవంతంగా పూర్తయి, అంతరిక్ష పరిశోధనలలో భారత దేశం చరిత్ర సృష్టించాలని కోరుకుంటున్నట్లు ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘెల్ తెలిపారు.