Uber: ఊబర్ లో ఇకపై గ్రూప్ రైడ్.. ఛార్జ్ షేరింగ్
- ఒకే క్యాబ్ లో ముగ్గురు ఒకేసారి రైడింగ్
- చార్జ్ ముగ్గురి మధ్య షేరింగ్
- నచ్చిన చోట పికప్, డ్రాప్ ఆఫ్
ఊబర్ లో కొత్త ఫీచర్ వచ్చింది. గ్రూప్ రైడ్స్ పేరుతో కొత్త సేవను మొదలు పెట్టింది. ఒకరికి మించిన వ్యక్తులు ఒకే గమ్యస్థానానికి వెళుతుంటే ట్రిప్ ను షేర్ చేసుకోవచ్చు. దీంతో చార్జ్ వారికి సమానంగా పడుతుంది. ఒక్కరిపైనే భారం అంతా పడకుండా ఉంటుంది. అంతేకాదు ఒకటికి మించిన డ్రాప్ ఆఫ్ లను కూడా యాడ్ చేసుకోవచ్చు. స్నేహితులతో ట్రిప్ ను షేర్ చేసుకోవచ్చు.
దీన్ని ఎకో ఫ్రెండ్లీ (పర్యావరణ అనుకూలం)గా ఊబర్ పేర్కొంది. ఎలా అంటే ఒక్కరే కాకుండా ఒకరికి మించిన వ్యక్తులు ఒకే వాహనాన్ని ఉపయోగించడం వల్ల ఇంధన వినియోగం తగ్గుతుంది. ఫలితంగా వాహన కాలుష్యం విడుదల కూడా తగ్గుతుంది. ఈ కొత్త ఫీచర్ గ్రూప్ రైడ్స్ ద్వారా యూజర్లు 30 శాతం వరకు ఆదా చేసుకోవచ్చని ఊబర్ తెలిపింది.
గ్రూప్ రైడ్స్ రోడ్లపై కార్ల రద్దీని కూడా తగ్గిస్తుందని ఊబర్ పేర్కొంది. ఒకే ప్రదేశానికి వెళ్లే స్నేహితులు, సహచర ఉద్యోగులకు అనుకూలమని తెలిపింది. స్నేహితులకు తమ రైడ్ సమాచారాన్ని పంచుకోవడం ద్వారా గ్రూప్ రైడ్స్ ను వినియోగించుకోవచ్చు. స్నేహితులు కూడా రైడ్ లో చేరి, వారిని ఎక్కడ పిక్ చేసుకోవాలన్నది లొకేషన్ ఇవ్వాలి. అప్పుడు ఊబర్ డ్రైవర్ వారిని వారి ప్రాంతాల నుంచి పిక్ చేసుకుంటాడు. ఊబర్ డ్రైవర్ ఆదాయం దీనివల్ల తగ్గదని ఊబర్ వివరణ ఇచ్చింది.
గ్రూప్ రైడ్స్ కోసం యూజర్లు తమ ఫోన్ లో తాజా వెర్షన్ ఊబర్ యాప్ ను అప్ డేట్ చేసుకోవాలి. యాప్ తెరిచి గ్రూప్ రైడ్ ఐకాన్ పై క్లిక్ చేయాలి. అప్పుడు పికప్, డ్రాప్ ఆఫ్ లొకేషన్లను నమోదు చేయాలి. బుకింగ్ వివరాలను సమీక్షించి కన్ఫర్మ్ చేయాలి. అప్పుడు అదే మార్గంలో స్నేహితులు కూడా వచ్చేట్టు అయితే వారికి లింక్ సెండ్ చేయాలి.