Narendra Modi: చంద్రయాన్ చారిత్రక విజయం చూసి నా జీవితం ధన్యమైంది: నరేంద్ర మోదీ
- చంద్రయాన్-3 విజయాన్ని దక్షిణాఫ్రికా నుంచి ప్రత్యక్షంగా వీక్షించిన ప్రధాని మోదీ
- విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగిన మరుక్షణం ప్రధానిలో వెల్లువెత్తిన హర్షం
- ఇదో చారిత్రక క్షణమన్న ప్రధాని,
- ఈ విజయం యావత్ మానవాళిదని వ్యాఖ్య
చంద్రయాన్-3 విజయంతో యావత్ భారతదేశం పులకించిపోయింది. దక్షిణాఫ్రికా నుంచి ఈ అద్భుత క్షణాలను వీక్షించిన ప్రధాని నరేంద్ర మోదీ అమితానందం వ్యక్తం చేశారు. ఈ చారిత్రక క్షణాలు వీక్షించడంతో జన్మ ధన్యమైందని వ్యాఖ్యానించారు.
ప్రధాని ప్రసంగం ఆయన మాటల్లోనే..
‘‘ఈ క్షణాలను ఎప్పటికీ మరిచిపోలేము. ఇవి అద్భుతమైన క్షణాలు.. ఇది భారత విజయ గర్జన.. సమస్యల మహాసముద్రాన్ని జయించిన క్షణం ఇది. చంద్రుడిపై విజయపు అడుగులు పడిన క్షణాలివి. కొత్త విశ్వాసం.. చైతన్యం.. ఉత్సాహంతో రాబోయే అద్భుత భవిష్యత్తుకు ఆహ్వానం పలుకుతున్న క్షణాలివి. మనం భూమిపై లక్ష్యాన్ని నిర్దేశించుకుని చంద్రుడిపై సాధించాం. మన శాస్త్రవేత్తలు చెప్పినట్టు ఇప్పుడు భారత్ చంద్రుడిపై కాలిడింది. నేడు మనం అంతరిక్షంలో భారత్ ప్రారంభించిన సరికొత్త ప్రయాణానికి సాక్ష్యంగా నిలిచాం.
నేను ఇప్పుడు బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాలో ఉన్నాను. కానీ ఇతర భారతీయుల లాగే నా మనసంతా చంద్రయాన్ -3పై ఉంది. ఈ చారిత్రాత్మక ఘట్టం వీక్షించిన ప్రతిభారతీయుడు సంబరాలు చేసుకున్నారు. ప్రతి ఇంట్లో ఉత్సాహం వెల్లివిరిసింది. నేను కూడా ఈ ఆనందోత్సాహాల్లో పాలు పంచుకుంటున్నాను. టీమ్ చంద్రయాన్, ఇస్రో, భారతీయ శాస్త్రవేత్తలందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెబుతున్నాను. ఈ క్షణం కోసం వాళ్లు ఏళ్ల పాటు పరిశ్రమించారు. ఈ క్షణం కోసం ఎదురు చూసిన 140 కోట్ల మంది దేశప్రజలకు వేనవేల శుభాకాంక్షలు. మన శాస్త్రవేత్తల శ్రమ, ప్రతిభ కారణంగా భారత్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై చేరుకుంది. మరే దేశమూ ఇప్పటివరకూ చేరుకోని ప్రాంతంలో కాలిడింది.
నేటి నుంచి చంద్రుడికి సంబంధించిన కథలు, సామెతలు అన్నీ మారిపోతాయి. కొత్త తరానికి కొత్త సామెతలు వస్తాయి. ఈ విజయం కేవలం భారత్‌కు చెందినది కాదు. ప్రస్తుతం భారత్ జీ20 దేశాలకు అధ్యక్షత వహిస్తోంది. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అన్న భారత దేశ విధానం ప్రపంచం నలుమూలలా మారుమోగుతోంది. మానవత్వపూరిత మా విధానాన్ని ప్రపంచమంతా స్వాగతిస్తోంది. చంద్రయాన్-3 మిషన్ కూడా ఈ ధృక్ఫథంతో కూడినది. కాబట్టి.. ఈ విజయం మానవాళిది. భవిష్యత్తులో ఇతర దేశాలు చంద్రుడిపై చేపట్టబోయే ప్రయోగాలకు చంద్రయాన్ విజయం సాయపడుతుంది. ప్రతి దేశమూ ఇలాంటి ఫీట్ సాధించగలదన్న నమ్మకం నాకుంది. మనందరం చంద్రుడితో పాటూ ఆపై లక్ష్యాలను కూడా సాకారం చేసుకోగలం.
ఈ విజయం భారత పురోగతిని మరింత ముందుకు తీసుకెళుతుంది. అనేక అద్భుత అవకాశాలను సాకారం చేసుకుంటాం. మనం ఇప్పటికే మరింత సమున్నత లక్ష్యాలు పెట్టుకున్నాం. త్వరలోనే ఇస్రో ఆదిత్య ఎల్, గగన్ యాన్ మానవరహిత అంతరిక్ష ప్రయోగం కోసం ఏర్పాట్లు చేస్తోంది. విజయాలకు ఆకాశమే హద్దు అని భారత్ పదే పదే నిరూపిస్తోంది. దేశ ఉజ్వల భవిష్యత్తుకు సైన్స్ అండ్ టెక్నాలజీనే ఆధారం. కాబట్టి, ఈ రోజు దేశప్రజలందరికీ శాశ్వతంగా గుర్తుండి పోతుంది. భవిష్యత్తుకు ప్రేరణగా నిలుస్తుంది. లక్ష్య సిద్ధికి దారి చూపిస్తుంది. వైఫల్యాన్ని అధిగమించి విజయం ఎలా అందుకోవచ్చో నేర్పిస్తుంది. ఈ శుభక్షణాన.. మరొక్కసారి శాస్త్రవేత్తలకు నా శుభాకాంక్షలు. భవిష్యత్తులో ఇస్రో చేపట్టే మిషన్లు కూడా విజయవంతం కావాలని ఆశిస్తున్నా’’ అని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు.