Revanth Reddy: నాగార్జున సాగర్ కట్టమీద చర్చకు సిద్ధమా?: కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్
- హైటెక్ సిటీని కాంగ్రెస్ అభివృద్ధి చేసిందన్న రేవంత్
- కృష్ణా, గోదావరి జలాలను భాగ్యనగరానికి తెచ్చింది కాంగ్రెస్ అని వ్యాఖ్య
- కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో బీఆర్ఎస్ లక్ష కోట్లు దోచేశారని ఆరోపణ
హైటెక్ సిటీని కాంగ్రెస్ పార్టీయే అభివృద్ధి చేసిందని, కృష్ణా, గోదావరి జలాలను కాంగ్రెస్ పార్టీ భాగ్యనగరానికి తీసుకువచ్చిందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. మాజీ మంత్రి చంద్రశేఖర్‌తో పాటు పలువురు నేతలు బుధవారం కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... కాళేశ్వరం ప్రాజెక్టుతో అధికార పార్టీ లక్ష కోట్లు కాజేసిందన్నారు. 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ బొందలగడ్డలా మారిందని ఆరోపించారు. దేశంలో తెలంగాణ నెంబర్ వన్ అని కేసీఆర్, కేటీఆర్ చెబుతున్నారని, అది నిజమేనని, ఎందుకంటే 60వేల బెల్ట్ షాపులు ఏ రాష్ట్రంలో లేవన్నారు. వైన్ షాపుల టెండర్ల పేరుతో రూ.2,600 కోట్లు కొల్లగొట్టారన్నారు.
కాంగ్రెస్ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తే, కేసీఆర్ రూ.7500 కోట్లకు తెగనమ్ముకున్నారన్నారు. సాగునీటి ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీయే అన్నారు. కాంగ్రెస్ ఏం చేసిందో నాగార్జున సాగర్ కట్టమీద చర్చకు సిద్ధమా? అని సవాల్ చేశారు. చరిత్ర తిరగేసి చూస్తే కాంగ్రెస్ ఏం చేసిందో తెలుస్తుందని చెప్పారు. కామారెడ్డికి గోదావరి నీళ్లు తెస్తేనే కేసీఆర్ ఇక్కడ అడుగు పెట్టాలన్నారు. కామారెడ్డిలో 22వ ప్యాకేజీ పనులు పూర్తి కాలేదన్నారు.
కాంగ్రెస్ హయాంలో పదేళ్లలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించామన్నారు. ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన చోట బీఆర్ఎస్ ఓట్లు అడగవద్దు.. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చిన చోట మేం అడగకుండా ఉంటాం... ఈ సవాల్‌కు కేసీఆర్ సిద్ధమా? అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదాన్ని కేసీఆర్ తుంగలో తొక్కారన్నారు. కమ్యూనిస్టులను కరివేపాకులా వాడుకొని వదిలేశారన్నారు. అందుకే ఏకపక్షంగా టిక్కెట్ కేటాయించుకున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్ ఒకటేనని, బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమే అన్నారు. 26న చేవెళ్లలో జరిగే సభను విజయవంతం చేయాలన్నారు.