Chandrayaan-3: అదే జరిగుంటే చంద్రయాన్-3 ఫెయిలయ్యేదే.. ఇస్రో చైర్మన్ కీలక వ్యాఖ్య
- చంద్రయాన్-3 మిషన్ విజయానంతరం ఇస్రో చైర్మన్ మీడియా సమావేశం
- మిషన్‌లో కీలక దశల గురించి వివరించిన సోమ్‌నాథ్
- చంద్రుడిపై దిగే ప్రదేశాలను సరిగా గుర్తించకపోయి ఉంటే మిషన్ విఫలమయ్యేదని వ్యాఖ్య
చంద్రయాన్-3 మిషన్‌లో విక్రమ్ ల్యాండర్ జాబిల్లి ఉపరితలాన్ని తాకడమే అత్యంత క్లిష్టమైన దశ అని ఇప్పటివరకూ అందరికీ ఉన్న భావన. అయితే, ఈ మిషన్‌కు సంబంధించి ఇస్రో చైర్మన్ ఎస్. సోమ్‌నాథ్ మీడియా సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మిషన్‌లోని క్లిష్టదశలకు సంబంధించి సవివరమైన సమాధానమిచ్చారు. ఈ ప్రయోగంలో నాలుగు కీలక దశలు ఉన్నాయని చెప్పారు.
‘‘ఈ ప్రయోగంలో అత్యంత క్లిష్టమైన దశ లాంచింగ్‌యే. జీఎస్ఎల్వీ మార్క్-3 ద్వారా చంద్రయాన్-3ని సరైన కక్ష్యలో ప్రవేశపెట్టాం. 36,500 కిలోమీటర్ల దూరం ప్రయాణించాక చంద్రయాన్-3 జాబిల్లి దిశగా ప్రయాణించాల్సిన కక్ష్యలోకి చేరింది. ఈ దశ అనుకున్నట్టుగానే పూర్తయ్యింది. ఈ ప్రయోగంలో రెండో కీలక దశ ల్యాండింగ్ అండ్ క్యాప్చరింగ్. ఇందులో పొరపాటు జరిగి ఉంటే తేరుకునే అవకాశమే ఉండేది కాదు. మిషన్ విఫలమయ్యేది’’ అని ఆయన చెప్పారు. చంద్రుడిపై దిగే ప్రదేశాల్ని చంద్రయాన్-3 గుర్తించడాన్ని శాస్త్రపరిభాషలో క్యాప్చరింగ్ ద మూన్ అని అంటారు. ఇందులో పొరపాట్లు జరిగితే ల్యాండర్ జాబిల్లిపై కూలిపోతుంది.
ఇక ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడివడటం మూడో కీలక దశ అని ఎస్.సోమ్‌నాథ్ వివరించారు. ‘‘మీరొకటి గుర్తుంచుకోవాలి! కొన్ని రోజుల పాటు అంతరిక్షంలో ప్రయాణించాక ఆర్బిటర్ నుంచి రోవర్ విడివడింది. ఇంతటి సుదీర్ఘ ప్రయాణం తరువాత కూడా వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేయడంతో అనుకున్న సమయానికి ల్యాండర్ ఆర్బిటర్ నుంచి విడివడింది. ఇక చివరి క్రిటికల్ దశను మనందరం కలిసే వీక్షించాం’’ అంటూ మిషన్‌కు సంబంధించి కీలక విషయాలను ఇస్రో చీఫ్ వెల్లడించారు.