ISRO: ఈ క్షణం కోసం ఎదురుచూపు: నాడు కన్నీళ్లు పెట్టుకున్న ఇస్రో మాజీ చైర్మన్ శివన్
- చంద్రయాన్-3 విజయవంతం కావడంపై ఇస్రో మాజీ చైర్మన్ హర్షం
- ఇది చాలా స్వీట్ న్యూస్ అన్న శివన్
- చంద్రయాన్-3 పంపించే సైన్స్ డేటా ప్రపంచ శాస్త్రవేత్తల కోసమని వెల్లడి
చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో మాజీ చైర్మన్ కే శివన్ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రోను అభినందించారు. ఈ చారిత్రక విజయం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, ఈ క్షణం కోసం ఎంతోకాలంగా ఎదురు చూశానన్నారు. ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ... ఇది అద్భుత విజయమని, ఈ విజయం కోసం గత నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ఇది చాలా స్వీట్ న్యూస్ అని, దేశమంతా ఎదురుచూస్తోన్న ఈ ప్రయోగం ఇప్పుడు విజయవంతమైందని చెప్పారు. ఇందుకు చాలా ఆనందంగా ఉందన్నారు.
అద్భుత విజయం సాధించినందుకు గాను దేశ ప్రజలందరికీ అభినందనలు తెలిపారు. ప్రభుత్వం కూడా సహకరించినట్లు చెప్పారు. చంద్రయాన్-3 పంపించే సైన్స్ డేటా ఒక్క భారత్ కోసమే కాదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలందరి కోసం అన్నారు. ఈ డేటా ద్వారా ప్రపంచ సైంటిస్ట్‌లు కొత్త విషయాలు కనుగొనేందుకు ఉపయోగపడుతుందన్నారు. చంద్రయాన్-3 ప్రయోగంలో ప్రపంచ ప్రయోజనాలు ఉన్నాయన్నారు. కాగా, 2019లో చంద్రయాన్-2 ల్యాండర్ విజయానికి అడుగు దూరంలో కుప్పకూలింది. దీంతో నాటి ఇస్రో చైర్మన్ శివన్ కన్నీళ్లు పెట్టుకోగా, ప్రధాని మోదీ ఓదార్చారు.