Yevgeny Prigozhin: రష్యాలో విమాన ప్రమాదం.. కిరాయి సైన్యం వ్యాగ్నర్ గ్రూప్ అధినేత మృతి
- రష్యా అధినాయకత్వంపై తిరుగుబాటు చేసి రాజీపడ్డ కొన్ని నెలలకే ఘటన
- విమానం కూలడంతో వ్యాగ్నర్ గ్రూప్ అధినేత ప్రిగోజిన్, సంస్థ సహవ్యవస్థాపకుడు మృతి
- మిసైల్ దాడి జరగడంతో విమానం కూలిపోయినట్టు రష్యా మీడియా వర్గాల్లో చర్చ
- రష్యా వెన్నుపోటుదారుల చేతిలో ప్రిగోజిన్ మరణించినట్టు వ్యాగ్నర్ గ్రూప్ ప్రకటన
ఉక్రెయిన్‌తో యుద్ధంలో కీలకపాత్ర పోషిస్తున్న రష్యా కిరాయి సైన్యం వ్యాగ్నర్ గ్రూప్ అధినేత యెవ్జినీ ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో మరణించారు. రష్యా అధినాయకత్వంపై తిరుగుబాటు చేసి ఆపై రాజీపడ్డ కొన్ని నెలలకే ప్రిగోజిన్ మరణించడం గమనార్హం. బుధవారం మాస్కో నుంచి సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు బయలుదేరిన విమానం ట్వెర్ ప్రాంతంలోని కుజెంకినో ప్రాంతంలో కూలిపోయినట్టు రష్యా అత్యవసర వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
రష్యా విమానయాన శాఖ రాస్‌ఏవియేట్సియా ప్రకటన ప్రకారం, ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 10 మంది ఉన్నారు. వారందరి పేర్లను రాస్ ఏవియేట్సియా ప్రకటించింది. ఈ ప్రమాదంలో వ్యాగ్నర్ గ్రూప్ సహవ్యవస్థాపకుడు, ప్రిగోజిన్‌కు సన్నిహితుడైన డిమిట్రీ యూట్కిన్ కూడా మరణించారు. ఈ ప్రమాదంపై రష్యా దర్యాప్తు ప్రారంభించింది.
విమానంపై మిసైళ్ల దాడి జరగడంతో అది కూలిపోయి ఉంటుందని రష్యా మీడియా వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు, ప్రిగోజిన్ మరణానికి సంతాప సూచకంగా సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో వ్యాగ్నర్ గ్రూప్ కార్యాలయంపై శిలువ ఆకారంలో ఉన్న గుర్తును ప్రదర్శించారు. కాగా, వ్యాగ్నర్ గ్రూపునకు చెందిన ఓ టెలిగ్రామ్ ఛానల్ ప్రిగోజిన్ మరణాన్ని ధ్రువీకరిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రిగోజిన్ ఓ హీరో అని కొనియాడిన వ్యాగ్నర్ గ్రూప్..రష్యా వెన్నుపోటు దారుల చేతిలో ఆయన మరణించినట్టు పేర్కొంది.
రష్యా అధ్యక్షుడిపైనే తిరుగుబాటు బావుటా ఎగురవేసి కలకలం రేపిన ప్రిగోజిన్ మరణంతో వ్యాగ్నర్ గ్రూప్ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి.