Sajjala Ramakrishna Reddy: గోడలు దూకడం, అడ్డదారులు తొక్కడం టీడీపీకి అలవాటే: సజ్జల
- టక్కు టమార విద్యల్లో చంద్రబాబు పీహెచ్‌డీ చేశారన్న సజ్జల
- ఓట్లు తొలగింపుపై టీడీపీది తప్పుడు ప్రచారమని విమర్శ
- దొంగ ఓట్లను గుర్తించి తొలగిస్తే రాద్ధాంతం చేస్తున్నారని మండిపాటు
ఓట్ల తొలగింపుపై టీడీపీది తప్పుడు ప్రచారమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. దొంగ ఓట్లను గుర్తించి తొలగిస్తే రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. టక్కు టమార విద్యల్లో చంద్రబాబు పీహెచ్‌డీ చేశారని మండిపడ్డారు. దొంగే.. ‘దొంగ దొంగ’ అన్నట్లు ఉందని, టీడీపీ అసలు స్వరూపం అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు.
గురువారం వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో సజ్జల మాట్లాడుతూ.. టీడీపీ గతంలో చేసిన తప్పులను తాము సరి చేశామని చెప్పారు. ‘‘టీడీపీకి తెలిసిందల్లా అడ్డదారులు తొక్కడమే. టక్కుటమార విద్యల్లో చంద్రబాబు పీహెచ్‌డీ చేశారు. ఆయన తన విద్యను అఖిల భారత స్థాయిలోనూ ప్రదర్శించారు. గోడలు దూకడం, అడ్డదారులు తొక్కడం టీడీపీకి అలవాటే” అని ఆరోపించారు.
లక్షల దొంగ ఓట్లు ఇంకా ఉన్నాయని సజ్జల చెప్పారు. కుప్పం నియోజకవర్గంలో 30 వేల దొంగ ఓట్లు బయటపడ్డాయని అన్నారు. దొంగ ఓట్ల వ్యవహారంలో చంద్రబాబుకు భయం పట్టుకుందని విమర్శించారు. మరోవైపు టీడీపీ అన్యాయంగా తీసేయించిన వైసీపీ వారి ఓట్లను తాము చేర్పించుకుంటున్నామని చెప్పుకొచ్చారు.