Narendra Modi: బ్రిక్స్ లో మరిన్ని దేశాలకు సభ్యత్వం కల్పించాలని నిర్ణయించాం: ప్రధాని మోదీ
- దక్షిణాఫ్రికాలో మూడ్రోజుల పాటు బ్రిక్స్ సదస్సు
- హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ
- బ్రిక్స్ ను విస్తరిస్తున్నామని వెల్లడి
- విస్తరణకు భారత్ ఎప్పుడూ అనుకూలమేనని స్పష్టీకరణ
- కొత్త అర్జెంటీనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ, యూఏఈలకు స్థానం
దక్షిణాఫ్రికాలోని జొహాన్నెస్ బర్గ్ నగరంలో జరుగుతున్న బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) దేశాల సదస్సు నేటితో ముగియనుంది. సదస్సుపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ లో స్పందించారు.
15వ వార్షిక బ్రిక్స్ సమావేశం సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఈ కూటమిని మరింత విస్తరించాలన్న అభిప్రాయానికి ఆమోదం లభించిందని తెలిపారు. బ్రిక్స్ విస్తరణకు భారత్ ఎల్లప్పుడూ అనుకూలమేనని మోదీ స్పష్టం చేశారు.
ఈ విస్తరణ వల్ల బ్రిక్స్ మరింత బలోపేతం అవుతుందని, ఎక్కువ ప్రభావవంతంగా మారుతుందని పేర్కొన్నారు. ఈ స్ఫూర్తితోనే అర్జెంటీనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈలను బ్రిక్స్ లోకి భారత్ ఆహ్వానిస్తోందని ప్రధాని మోదీ వివరించారు.