Donald Trump: ఎన్నికల అవకతవకల కేసులో డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్, బెయిల్
- జార్జియా రాష్ట్రంలోని ఫుల్టన్ కౌంటీ జైల్ వద్ద లొంగిపోయిన ట్రంప్
- ట్రంప్‌ను అధికారికంగా అరెస్ట్ చేసిన పోలీసులు, ఆయన ఫొటో, వేలిముద్రల సేకరణ
- అనంతరం రెండు లక్షల డాలర్ల పూచీకత్తుపై బెయిల్ మంజూరు
- తన అరెస్ట్ న్యాయప్రక్రియను అపహాస్యం చేయడమేనంటూ ట్రంప్ ఆగ్రహం
ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా పోలీసుల ముందు లొంగిపోయారు. 2020 నాటి అధ్యక్ష ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేసేలా జార్జియా రాష్ట్ర ఫలితాల్ని తారుమారు చేసేందుకు కుట్ర పన్నారన్న ఆరోపణలపై ట్రంప్ బుధవారం పోలీసులకు లొంగిపోయారు. జార్జియాలోని ఫుల్టన్ కౌంటీ జైలు వద్దకు వచ్చిన ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో అధికారులు ట్రంప్ ఫొటో, వేలిముద్రలు, ఇతర వివరాలను తీసుకున్నారు.
అయితే, రెండు లక్షల డాలర్ల విలువైన బాండ్‌ను సమర్పించి బెయిల్ పొందేందుకు ట్రంప్‌ను అట్లాంటా పుల్టన్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ ఫానీ విల్లిస్ అనుమతించారు. దీంతో, సుమారు అరగంట పాటు జైల్లో ఉన్న ట్రంప్ అధికారిక లాంఛనాలన్నీ పూర్తయ్యాక అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కాగా, తన అరెస్ట్ అమెరికాకు విషాదకర దినమని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకుంటున్నారంటూ ప్రత్యర్థి డెమోక్రటిక్ పార్టీ సభ్యులపై మండిపడ్డారు. ఇది న్యాయ ప్రక్రియను అపహాస్యం చేయడమేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల అవకతవకలకు సంబంధించి ట్రంప్‌పై నమోదైన నాలుగు కేసుల్లో ఇదీ ఒకటి.