BRS: ఎంపీ ధర్మపురి అర్వింద్ పై ఈసీకి ఫిర్యాదు
- ఇటీవల నిజామాబాద్ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎంపీ
- ఎన్నికల్లో ఎవరికి ఓటు వేసినా చివరికి తానే గెలుస్తానన్న అర్వింద్
- ఆయనపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి బీఆర్ఎస్ ఫిర్యాదు
బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పై అధికార బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఇటీవల నిజామాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎవరికి ఓటేసినా చివరికి గెలిచేది మాత్రం తానేనంటూ వ్యాఖ్యానించారని, ఇది ఎన్నికల వ్యవస్థనే అపహాస్యం చేయడమని బీఆర్ ఎస్ విమర్శించింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్‌కు బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, లీగల్ సెల్ ఇన్‌చార్జి సోమ భరత్ కుమార్ గుప్తా ఫిర్యాదు చేశారు.
ఎన్నికల్లో గెలిచేందుకు అర్వింద్ దొంగ దారులు వెతుక్కొంటున్నారని భరత్ గుప్తా మండిపడ్డారు. అర్వింద్ వ్యాఖ్యలు ఎన్నికల వ్యవస్థపై అనుమానాలు కలిగించేలా ఉన్నాయన్నారు. ఎంపీ అర్వింద్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ జమాతే ఉలేమా ఏ హింద్ అధ్యక్షుడు హఫీజ్ లాయక్‌ఖాన్, నాంపల్లి కోర్టుకు చెందిన న్యాయవాదులు కూడా రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు.