President Xi: ఎట్టకేలకు ప్రధాని మోదీతో ముచ్చటించిన జిన్ పింగ్
- బ్రిక్స్ దేశాల సమావేశం సందర్భంగా చోటు చేసుకున్న భేటీ
- వాస్తవాధీన రేఖపై వివాదం పరిష్కారం కాకపోవడం పట్ల మోదీ అసంతృప్తి
- రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడాలన్న జిన్ పింగ్
- ఉమ్మడి ప్రయోజనాల కోసం కలసి నడుద్దామని పిలుపు
చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎట్టకేలకు ద్వైపాక్షిక అంశాలపై భేటీ నిర్వహించారు. జోహెన్నెస్ బర్గ్ లో బ్రిక్స్ దేశాల సమావేశం సందర్భంగా ఇది అనధికారికంగా జరిగింది. దీనిపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘చైనా-భారత్ సంబంధాలు, ఇతర అంశాలపై జిన్ పింగ్, మోదీ నిష్కపటమైన, లోతైన అభిప్రాయాలను పంచుకున్నారు’’ అని పేర్కొంది.
‘‘చైనా-భారత్ సంబంధాలు మెరుగుపడితే అది రెండు దేశాలు, ప్రజల ఉమ్మడి ప్రయోజనాలకు దారితీస్తుంది. ప్రపంచం, ఈ ప్రాంతంలో శాంతి స్థాపనకు, సుస్థిరత, అభివృద్ధికి దోహదపడుతుందని అధ్యక్షుడు జిన్ పింగ్ పేర్కొన్నారు’’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. ద్వైపాక్షిక ప్రయోజనాలను రెండు దేశాలూ దృష్టిలో ఉంచుకుని, సరిహద్దు అంశాలను సరైన రీతిలో పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు.
స్వల్ప సమయం పాటు జరిగిన ఈ భేటీలో భారత్-చైనా వాస్తవాధీన రేఖకు సంబంధించిన అంశాలు పరిష్కారం కాకపోవడంపై మోదీ ఆందోళన వ్యక్తం చేసినట్టు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వినయ్ మోహన్ క్వాత్రా తెలిపారు. 2020 మేలో గల్వాన్ లోయ వద్ద చైనా, భారత్ బలగాల మధ్య పోరు తర్వాత జిన్ పింగ్, మోదీ భేటీ కావడం ఇది రెండోసారి. 2022 నవంబర్ లో ఇండోనేషియాలోని బాలీలో జరిగిన జీ20 సమావేశం సందర్భంలో ఇద్దరు నేతలు కలుసుకున్నారు.