Asaduddin Owaisi: పాతబస్తీలో బీఆర్ఎస్ అభ్యర్థులను ఎందుకు నిలబెట్టిందో చెప్పిన అసదుద్దీన్!
- రాజకీయాల్లో పోటీ అనేది ఉండాలన్న హైదరాబాద్ ఎంపీ
- తెలంగాణ రాష్ట్రంలో సమస్యలన్నీ పరిష్కారమయ్యాయన్న అసద్
- మైనార్టీలకు కేసీఆర్ ప్రభుత్వం ఎంతో చేసిందని కితాబు
- చైనా ముందు బీజేపీ ప్రభుత్వం మోకరిల్లిందని ఆరోపణ
తెలంగాణ రాష్ట్రంలో అన్ని సమస్యలు పరిష్కారమయ్యాయంటూ మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు. శుక్రవారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ... తెలంగాణలో సమస్యలన్నీ పరిష్కారమయ్యాయని, కేసీఆర్ ప్రభుత్వం మైనార్టీలకు ఎంతో చేసిందని కితాబునిచ్చారు. ఈసారి తమ స్థానాలు పెంచుకుంటామన్నారు. కేసీఆర్‌ను తక్కువగా అంచనా వేయవద్దన్నారు. అయినప్పటికీ రాజకీయాల్లో పోటీ అనేది ఉండాలని, అందుకే తాము నిలబడినచోట కూడా బీఆర్ఎస్ తమ అభ్యర్థులను నిలబెట్టిందన్నారు.
పాతబస్తీలో మజ్లిస్ పార్టీకి ఏడుగురు ఎమ్మెల్యేలు వున్నారు. ఇటీవల కేసీఆర్ 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. అందులో మజ్లిస్ పార్టీ గెలిచిన ఏడు సీట్లు కూడా ఉన్నాయి. బీఆర్ఎస్, మజ్లిస్ దోస్తీ అంటూనే ఇక్కడ వేర్వేరుగా పోటీకి నిలబెట్టడంపై చర్చ సాగింది. ఈ అంశంపై అసద్ మాట్లాడుతూ.. రాజకీయాల్లో పోటీ అనేది ఉండాలన్నారు.
కేసీఆర్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించిన అసద్, కేంద్ర ప్రభుత్వంపై మాత్రం నిప్పులు చెరిగారు. చైనా మన భూభాగాన్ని ఆక్రమిస్తోందని ధ్వజమెత్తారు. చైనా ముందు బీజేపీ ప్రభుత్వం మోకరిల్లుతోందని ఆరోపించారు. గాల్వాన్ లోయలో అసలేం జరుగుతోందో దేశ ప్రజలకు చెప్పాలని నిలదీశారు. చైనాతో 19సార్లు చర్చలు జరిగాయని, ఇందుకు సంబంధించిన వివరాలు బయటపెట్టాలన్నారు. లడఖ్‌లో ఏం జరుగుతోందో చెప్పకుండా దాచిపెడుతున్నారన్నారు.