Thummala: రాజకీయాలకు స్వస్తి చెబుతానని సీఎంకు చెప్పా... కానీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా: తుమ్మల
- నలభై ఏళ్లుగా రేయింబవళ్లు జిల్లా కోసం త్యాగం చేశానన్న తుమ్మల
- మీకోసం రాజకీయాల్లో ఉంటానని కార్యకర్తలకు వెల్లడి
- ప్రజల కోసం పోటీ చేస్తానని వ్యాఖ్య
- తనను తప్పించారని శునకానందం పొందవచ్చు.. కానీ మీరు రాజకీయంగా బతికిస్తారని నమ్మకం
- తనను తప్పించినందుకు ఎవరినీ నిందించనన్న మాజీ మంత్రి
తాను రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని తుమ్మల నాగేశ్వర రావు ప్రకటించారు. శుక్రవారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఆ భగవంతుడు శ్రీరామచంద్రుడు ఇచ్చిన శక్తిమేరకు ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా పది నియోజకవర్గాలకు నలబై ఏళ్లుగా రేయింబవళ్లు సేవ చేశానన్నారు. జిల్లా కోసం తన జీవితాన్ని త్యాగం చేశానన్నారు. అధికారంలో ఉన్నా.. లేకపోయినా ఈ జిల్లా కోసం పని చేశానన్నారు. తనకు ఎన్నికలు అవసరం లేదని, కానీ మీ ఉత్సాహం, మీ ఆనందం, మీ అభిమానం చూసిన తర్వాత పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని, తద్వారా ఖమ్మం జిల్లా ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు.
గత ఎన్నికలతోనే తాను రాజకీయాలకు స్వస్తి చెబుతున్నానని ముఖ్యమంత్రికి చెప్పానని, జిల్లాతో రాజకీయ అనుబంధాన్ని తెంచుకోవాలని నిర్ణయించుకున్నానని అన్నారు. కానీ తనకు ఇంతగా అవకాశం ఇచ్చిన ఖమ్మం జిల్లా ప్రజలకోసం పోటీ చేయనున్నట్లు చెప్పారు. ఈ జిల్లాకు ఏం చేసినా రుణం తీర్చుకోలేనన్నారు. తాను ఎన్నోసార్లు కిందపడ్డానని, అయినప్పటికీ తనను ఖమ్మం ప్రజలు రాజకీయంగా బతికించారన్నారు. అలాంటి మీ ప్రేమ కోసం, అనుబంధం కోసం, మీ ఆలోచన కోసం... ఆ గోదావరి జలాలతో మీ పాదాలు కడిగే వరకు ఎమ్మెల్యేగా ఉంటానన్నారు.
తనకు రాజకీయాలు అవసరం లేదని, కానీ ఇప్పుడు మీకోసం రాజకీయ జీవితం కొనసాగిస్తానని అన్నారు. తనకు అహంకారం, అలంకారం, ఆధిపత్యం, అధికారం చలాయించడం కోసం పదవి అవసరం లేదని, తన జిల్లా ప్రజల చిరునవ్వు కోసం అవసరమన్నారు. తన రాజకీయ లక్ష్యాన్ని నెరవేరుస్తానన్నారు. కొంతమంది పరాన్నబుక్కులు తనను తప్పించారని శునకానందం పొందుతున్నారని, కానీ తనను రాజకీయంగా మీరు బతికిస్తారని భావిస్తున్నానన్నారు. ఈ ఎన్నికల్లో ఈ జిల్లా ప్రజల కోసం, మీ ప్రతిష్ఠ కోసం, మీ ఆత్మాభిమానం కోసం, మీ ఆత్మగౌరవం కోసం ఎన్నికల్లో నిలబడుతున్నానన్నారు.
ఈ గడ్డపై ఎంతోమంది మహానుభావులు పుట్టారని, వారికంటే ఎక్కువగా నాకు అవకాశం వచ్చిందని, అందుకు ఈ జిల్లాకు, పని చేసే అవకాశం ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు అన్నారు. వచ్చే ఎన్నికల్లో నిలబడతానన్నారు. తనను తప్పించినందుకు ఎవరినీ నిందించదల్చుకోలేదని, ధర్మం కోసం.. మీ కోసం ఎన్నికల్లో నిలబడుతున్నానన్నారు. నన్ను మీ గుండెల్లో పెట్టుకొని ఆదరిస్తారని ముందుకు వచ్చానన్నారు. తల నరుక్కుంటాను కానీ నా వల్ల ఎవరూ తలదించుకోవద్దన్నారు.