Nirmala Sitharaman: రాబడి పెంచుకోవడానికి స్థిర విధానాలు.. ప్రజలపై భారం మాత్రం వేయం: నిర్మలా సీతారామన్
- ఎన్డీయే ప్రభుత్వం సంస్కరణలు మంచి ఫలితాలు ఇచ్చాయన్న ఆర్థికమంత్రి
- గత ప్రభుత్వాల సంస్కరణలు అస్తవ్యస్తంగా ఉండేవని వ్యాఖ్య
- విద్య, వైద్య రంగాల్లో పెట్టుబడులపై దృష్టి సారించినట్లు వెల్లడి
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టిన సంస్కరణలు మంచి ఫలితాలనిచ్చాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. గత ప్రభుత్వాలు కూడా ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చినప్పటికీ అవి అస్తవ్యస్తంగా ఉండేవన్నారు. ఢిల్లీలో నిర్వహిస్తున్న బీ20 సదస్సులో ఆమె ప్రసంగిస్తూ... కరోనా సమయంలో కూడా సంస్కరణల అమలును ఆపివేయలేదన్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న ఆర్థిక వ్యవస్థ మనదే అన్నారు. పెట్టుబడుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం జీడీపీ ఫలితాలు త్వరలో వస్తాయని, అంతా మంచే జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
విద్య, వైద్య రంగాల్లో పెట్టుబడులు పెట్టడంపై ప్రధానంగా దృష్టి సారించినట్లు చెప్పారు. ప్రపంచ దేశాలు కూడా దీనిపై దృష్టి సారించాలని లేదంటే అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఆరోగ్య వ్యవస్థలు దెబ్బతింటాయన్నారు. ఆరోగ్య సంక్షోభ పరిస్థితులు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు, ప్రభుత్వ రాబడిని పెంచుకోవడానికి కేంద్రం స్థిరమైన విధానాలను అవలంబిస్తోందన్నారు. కానీ పన్నులు పెంచి ప్రజలపై భారం వేసేది లేదన్నారు. ధరలు పెంచితే ద్రవ్యోల్బణాన్ని పూర్తిగా నియంత్రించలేమని, ఈ క్రమంలో వృద్ధిని దృష్టిలో పెట్టుకోవాలన్నారు.