Rail Over Rail Bridge: గూడూరు-మనుబోలు స్టేషన్ల మధ్య అత్యంత పొడవైన రైల్ వంతెన
- 2.2 కిలోమీటర్ల పొడవుతో బ్రిడ్జి నిర్మాణం
- దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే అత్యంత పొడవైన ఆర్వోఆర్‌గా గుర్తింపు
- పెరగనున్న రైళ్ల సగటు వేగం
తిరుపతి జిల్లాలోని గూడూరు-నెల్లూరు జిల్లాలోని మనుబోలు రైల్వే స్టేషన్ల మధ్య 2.2 కిలోమీటర్ల పొడవుతో నిర్మించిన అత్యంత పొడవైన రైల్వే ఫ్లై ఓవర్ నిన్నటి నుంచి అందుబాటులోకి వచ్చింది. ఇది దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే అత్యంత పొడవైన రైల్ ఓవర్ రైల్ (ఆర్వోఆర్)గా గుర్తింపు తెచ్చుకుంది. రెండేళ్లలోనే దీని నిర్మాణం పూర్తి చేశారు.
విజయవాడ-గూడూరు మధ్య మూడో లైను పనుల కోసం దక్షిణ మధ్య రైల్వే రూ. 3,240 కోట్లు మంజూరు చేసింది. అందులో భాగంగానే ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టారు. 32.5 టన్నుల యాక్సిల్ లోడుతో రైళ్లు ప్రయాణించేలా దీనిని నిర్మించారు. బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో విజయవాడ-రేణిగుంట, చెన్నై-విజయవాడ మధ్య ఎలాంటి అంతరాయం లేకుండా రైళ్ల రాకపోకలు సాగుతాయని, ఈ మార్గంలో రైళ్ల సగటు వేగం పెరుగుతుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు.