Narendra Modi: చంద్రయాన్-3 దిగిన ప్రాంతానికి, చంద్రయాన్-2 క్రాష్ అయిన ప్రదేశానికి అద్భుతమైన పేర్లు పెట్టిన మోదీ!
- బెంగళూరులో ఇస్రో శాస్త్రవేత్తలతో భేటీ అయిన మోదీ
- చంద్రయాన్-3 చంద్రుడిని ముద్దాడిన ప్రదేశానికి 'శివశక్తి పాయింట్' అని నామకరణం
- చంద్రయాన్-2 క్రాష్ అయిన ప్రాంతానికి 'తిరంగా పాయింట్' అని పేరు పెట్టిన ప్రధాని
చంద్రయాన్-3 మిషన్ ద్వారా చందమామపై భారత్ సగర్వంగా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మరే అగ్ర దేశమూ అడుగు పెట్టని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి అంతరిక్ష రంగంలో మన సత్తా ఏంటో ప్రపంచానికి చాటింది. ఈ చారిత్రాత్మక ఘటన చోటు చేసుకుంటున్న సమయంలో ప్రధాని మోదీ దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నారు. బ్రిక్స్ సమ్మిట్ కోసం ఆయన సౌతాఫ్రికాలో ఉండిపోయారు. అక్కడి నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన ప్రధాని బెంగళూరులో ఇస్రో శాస్త్రవేత్తలతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మన ఖ్యాతిని దిగంతాలకు చాటిన ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రశంసలు కురిపించారు. చంద్రుడిని విక్రమ్ ల్యాండర్ తాకిన ప్రదేశానికి 'శివశక్తి పాయింట్' అని మోదీ నామకరణం చేశారు. ఇప్పటి నుంచి ఆ ప్రాంతం ఇదే పేరుతో పిలవబడుతుందని చెప్పారు. శివశక్తి అనే పదం కష్టానికి గుర్తు అని... మహిళా శాస్త్రవేత్తల స్ఫూర్తి, సాధికారతకు నిదర్శనమని అన్నారు.
ఇదే సమయంలో చంద్రయాన్-2 మిషన్ కు సంబంధించి విక్రమ్ ల్యాండర్ క్రాష్ అయిన ప్రాంతానికి కూడా మోదీ పేరు పెట్టారు. వాస్తవానికి ఆ మిషన్ విఫలమైన నేపథ్యంలో ఆ ప్రాంతానికి పేరు పెట్టవద్దని తొలుత భావించారు. అయితే, చంద్రయాన్-3 విజయవంతం అయిన నేపథ్యంలో ఆ ప్రాంతానికి కూడా పేరు పెట్టాలని ప్రధాని నిర్ణయించారు. చంద్రయాన్-2 క్రాష్ అయిన ప్రాంతానికి 'తిరంగా పాయింట్' అని నామకరణం చేశారు. చంద్రుడిపై మన మువ్వన్నెల పతాకం ఎగురుతూనే ఉంటుందని చాటి చెప్పేలా ఈ పేరును పెట్టారు. చంద్రయాన్-3 సక్సెస్ అయిన రోజు మన స్పేస్ అండ్ టెక్నాలజీ రంగానికి అత్యంత గొప్ప దినమని... రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా మోదీ చెప్పారు.