Madurai Train Accident: మధురైలో ఘోర రైలు ప్రమాదం.. గ్యాస్ సిలిండర్ పేలి 9 మంది దుర్మరణం
- మరో 20 మందికి తీవ్ర గాయాలు
- ప్రమాద సమయంలో రైలులో 63 మంది ప్రయాణికులు
- బోగీలోకి రహస్యంగా గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చిన ప్రయాణికుడు
- టీ కాచుకునే సమయంలో ప్రమాదం
- పూర్తిగా దగ్ధమైన కోచ్
తమిళనాడులోని మధురైలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 9 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. రైలు లక్నో నుంచి రామేశ్వరం వెళ్తుండగా మధురై వద్ద ఈ ఘటన జరిగింది. రైలులోని ఓ ప్రైవేటు పార్టీ కోచ్‌లో టీ చేసుకునే ప్రయత్నంలో సిలిండర్ పేలినట్టు తెలుస్తోంది. ఆ సిలిండర్‌ను ప్రయాణికుడొకరు రహస్యంగా తెచ్చినట్టు సమాచారం.
ప్రమాదంలో రైలు బోగీ పూర్తిగా దగ్ధమైంది. ఘటన సమయంలో రైలులో 63 మంది ప్రయాణికులు ఉన్నారు. 9 మంది మృత్యువాత పడగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు జరిగిన వెంటనే కొందరు ప్రయాణికులు అప్రమత్తమై కిందకు దిగిపోవడంతో ప్రాణనష్టం తప్పింది. కాగా, రైలు ఈనెల 17న లక్నోలో బయలుదేరింది. రేపు చెన్నై చేరుకోవాల్సి ఉంది.