Prof Navaneetha Rao: ఓయూ మాజీ వీసీ నవనీతరావు కన్నుమూత
- ఆయన నివాసానికి చేరుకుంటున్న విద్యార్థులు, అధ్యాపకులు
- ఉస్మానియా వర్సిటీ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారన్న ఎమ్మెల్సీ దాసోజు
- నివాళులు అర్పిస్తున్న ఓయూ పూర్వ విద్యార్థులు
ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స్ లర్ ప్రొఫెసర్ నవనీత రావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. 95 ఏళ్ల వయసులో శనివారం తుదిశ్వాస వదిలారు. ప్రొఫెసర్ నవనీతరావు ఇకలేరనే వార్త తెలుసుకున్న ఓయూ విద్యార్థులు, అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. నవనీతరావు పార్థివదేహానికి నివాళులు అర్పిస్తున్నారు. వర్సిటీ అభివృద్ధికి ప్రొఫెసర్ నవనీతరావు ఎంతగానో కృషి చేశారని చెబుతున్నారు. ప్రొఫెసర్ నవనీతరావు విద్యార్థిగా, ఆపై అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఆయనతో పాటు కలిసి పనిచేశానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ గుర్తుచేసుకున్నారు. నవనీతరావు మరణం తీరనిలోటని ట్విట్ చేశారు.
ప్రొఫెసర్ నవనీతరావు 1985 నుంచి 1991 వరకు ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ గా పనిచేశారు. తన పదవీకాలంలో వర్సిటీ ప్రతిష్ఠను, గౌరవాన్ని పెంపొందించారని దాసోజు పేర్కొన్నారు. ఆయనో డైనమిక్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పారు. తనలాంటి ఎంతోమంది విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దారని తెలిపారు. వర్సిటీ వ్యవహారాల్లో రాజకీయ జోక్యాలకు తావివ్వకుండా వర్సిటీ స్వయం ప్రతిపత్తిని కొనసాగించారని చెప్పారు. ప్రొఫెసర్ నవనీతరావు ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు.