DK Shivakumar: బెంగళూరులో ప్రధానికి స్వాగతం పలకకపోవడంపై డీకే శివకుమార్
- పీఎంవో నుండి వచ్చిన సమాచారం మేరకే తాము స్వాగతం పలకలేదని వెల్లడి
- రాజకీయాలకు ఇది సమయం కాదని, ఇప్పుడు అభివృద్ధిపై దృష్టి సారించాలని వ్యాఖ్య
- ఉదయాన్నే వచ్చి ఇబ్బందిపడొద్దని సీఎం, డిప్యూటీ, గవర్నర్లకు మోదీ సూచన
పీఎంవో నుండి వచ్చిన సమాచారం మేరకే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తాను.. ప్రధాని నరేంద్ర మోదీకి బెంగళూరు విమానాశ్రయంలో స్వాగతం పలకలేదని కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వెల్లడించారు. ప్రధానికి సాదరస్వాగతం పలికేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కానీ పీఎంవో సమాచారంతో దూరంగా ఉన్నట్లు తెలిపారు.
చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించేందుకు ప్రధాని మోదీ బెంగళూరుకు వచ్చిన సందర్భంగా ప్రోటోకాల్ ఉల్లంఘన అంశం తెరపైకి వచ్చింది.
రాజకీయాలు చేసే గడువు అయిపోయిందని (ఎన్నికలను ఉద్ధేశించి), ఇప్పుడు అభివృద్ధిపై దృష్టి పెట్టవలసిన సమయమని శివకుమార్ అన్నారు. సంస్కృతీ సంప్రదాయాలకు కర్ణాటక నెలవు అనీ, ప్రధాని ఏ సమయంలో వచ్చినా మాలో (ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి) ఏవరో ఒకరం ఆయనను రిసీవ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నామనీ, కానీ పీఎంవో నుండి సమాచారం ఉన్నందున వెళ్లలేదన్నారు.
దీనిపై ప్రధాని మోదీ కూడా వివరణ ఇచ్చారు. వాస్తవానికి, గ్రీస్ నుంచి బెంగళూరుకు చేరుకోవడం ఆలస్యమయ్యే అవకాశమున్నందున హెచ్ఏఎల్ విమానాశ్రయంలో తనకు స్వాగతం పలకాల్సిన అవసరం లేదని సిద్ధరామయ్య, శివకుమార్‌లకు సూచించినట్లు ప్రధాని స్వయంగా చెప్పారు.
చంద్రయాన్ -3 ప్రయోగం సమయంలో తాను విదేశాల్లో ఉన్నానని, భారత్ వచ్చాక ముందుగా బెంగళూరుకు వెళ్లి శాస్త్రవేత్తలను పలకరించాలని నిర్ణయించుకున్నానని, తాను విదేశాల నుంచి వస్తున్నందున ఆలస్యం కావొచ్చునని, అందుకే ఇంత ఉదయాన్నే వచ్చి తనను రిసీవ్ చేసుకునేందుకు ఇబ్బంది పడవద్దని ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, గవర్నర్ (తావర్‌చంద్ గెహ్లాట్)ను కోరానని, వారి సహకారానికి నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ప్రధాని మోదీ అన్నారు.
ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ప్రధాన కార్యదర్శి వందితశర్మ, డీజీ అండ్ ఐజీపీ అలోక్ మోహా, బెంగళూరు పోలీసు కమిషనర్ బి.దయానంద, బెంగళూరు ప్రాంతీయ కమిషనర్ అమ్లాన్ బిస్వాస్, బెంగళూరు డిప్యూటీ కమిషనర్ కెఎ దయానంద్ ప్రధానమంత్రికి స్వాగతం పలికారు.