gangula kamalakar: బండి సంజయ్, రేవంత్ కనీసం 50 మందిని ఒకేసారి ప్రకటిస్తారా?: తెలంగాణ రాష్ట్ర మంత్రి గంగుల
- కాంగ్రెస్, బీజేపీలకు అభ్యర్థులు దొరకని పరిస్థితి ఉందన్న గంగుల
- కేసీఆర్ అభ్యర్థుల ప్రకటనతో ప్రతిపక్షాల కాళ్ల కింద భూమి కంపిస్తోందని ఎద్దేవా
- కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులు అమ్ముకుందని ఆరోపణ
కాంగ్రెస్, బీజేపీలకు అభ్యర్థులు దొరకని పరిస్థితి నెలకొందని తెలంగాణ రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శనివారం కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ 115 మంది అభ్యర్థులను ఒకేసారి ఇంత ముందుగా ప్రకటించడంతో ప్రతిపక్షాల కాళ్ల కింద భూమి కంపిస్తోందన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసం దొంగలను, రౌడీషీటర్లను కాంగ్రెస్ బరిలోకి దింపుతోందన్నారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డిలకు ఒకేసారి కనీసం 50 మందిని ప్రకటించే దమ్ము ఉందా? అని సవాల్ చేశారు. కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులను అమ్ముకుంటోందని ఆరోపించారు.
బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ అధికారంలోకి వస్తే తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణిస్తాయన్నారు. ముప్పై, నలభై కేసులు ఉన్నవారు కూడా కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారన్నారు. తస్మాత్ జాగ్రత్త.. భవిష్యత్తు తరాల బాగు కోసం కేసీఆర్‌నే గెలిపించుకోవాలన్నారు.
కాంగ్రెస్, బీజేపీలు మోసకారి పార్టీలని, ఒక్క అవకాశం అంటూ వచ్చే ఆ పార్టీలను నమ్మి ఓటేస్తే దివ్యాంగుల పెన్షన్లు కూడా ఎత్తుకు పోతారన్నారు. గత ప్రభుత్వాలు దివ్యాంగులను చిన్నచూపు చూశాయన్నారు. దేశ చరిత్రలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో దివ్యాంగులకు రూ.4 వేల పెన్షన్ ఇస్తున్నామన్నారు. కరీంనగర్ జిల్లాలో 23 వేల మంది దివ్యాంగులకు రూ.11.85 కోట్ల పెన్షన్ చెల్లిస్తున్నామని, దేశంలో ఒంటరి మహిళలకు, డయాలసిస్ పేషెంట్లకు, బీడీ, టేకేదార్లకు పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.