Etela Rajender: ఖమ్మంలో ఈటల ఫ్లెక్సీ గొడవ... అమిత్ షా సభను బహిష్కరిస్తామని హెచ్చరిక?
- ఖమ్మం బహిరంగ సభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో లేని ఈటల ఫోటో
- నిర్వహణ కమిటీ ఎదుట నిరసన తెలిపిన ఈటల వర్గీయులు
- రేపటిలోగా ఫ్లెక్సీలో ఈటల ఫోటోను ఏర్పాటు చేస్తామని హామీ
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదివారం నాడు తెలంగాణలో పర్యటించనున్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో జరగనున్న రైతు గోస-బీజేపీ భరోసా సభలో పాల్గొంటారు. ఈ బహిరంగ సభ కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫోటో కనిపించకపోవడం వివాదాస్పదమైంది.
మైదానం లోపల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఈటల ఫోటో కనిపించకపోవడంతో ఆయన వర్గీయులు నిరసన వ్యక్తం చేశారు. ఈటల ఫోటో లేకపోతే తాము అమిత్ షా సభను బహిష్కరిస్తామని హెచ్చరించినట్టు తెలుస్తోంది.
స్టేట్ కమిటీ, జిల్లా కమిటీ సభ్యులు పలువురు అలకవహించారు. రేపటి లోపు ఈటల ఫోటో ఉండాలని ఆయన వర్గీయులు డిమాండ్ చేశారు. నిర్వహణ కమిటీ సభ్యులతో కరీంనగర్, హైదరాబాద్, వరంగల్ సహా పలు ప్రాంతాల నుండి వచ్చిన ఈటల వర్గీయులు వాదనకు దిగారు. రేపు ఉదయం లోపు ఫ్లెక్సీలో ఈటల పోటోను ఏర్పాటు చేస్తామని సభ నిర్వాహకులు వెల్లడించారు. ఈటల ఫోటోతో ఫ్లెక్సీ ఏర్పాటుకు సన్నద్ధమయ్యారు.