Reynolds 045: రెనాల్డ్స్ 045 పెన్నుల ఉత్పత్తి నిలిపివేస్తారంటూ వార్త వైరల్.. స్పందించిన సంస్థ
- రెనాల్డ్స్ పెన్ను తయారీ నిలిపివేసే ప్రసక్తే లేదని స్పష్టీకరణ
- సోషల్ మీడియాలో వైరల్ వార్తలన్నీ అవాస్తవమంటూ ప్రకటన
- అధికారిక సమాచారం కోసం సంస్థ వెబ్సైట్ లేదా సోషల్ మీడియా పేజీలను మాత్రమే చూడాలని సూచన
- పెన్ను డిజైన్లో కూడా ఎటువంటి మార్పులూ ఉండవని వెల్లడి
రెనాల్డ్స్ 045.. ఈ పెన్ను గురించి తెలీని వారు ఉండరంటే అతి శయోక్తి కాదేమో. ఎందరో విద్యార్థులు తొలిసారిగా వినియోగించిన పెన్ను ఇదే. స్కూలు రోజులు గుర్తొచ్చిన ప్రతిసారీ కళ్లముందు కచ్చితంగా మెదిలేది రెనాల్డ్స్. అయితే ఓ తరం విద్యార్థుల జీవితాలతో ముడిపడిన పెన్ను ఇకపై మార్కెట్లో కనబడదంటూ ఓ వార్త ఇటీవల నెట్టింట్లో వైరల్ అవుతూ కలకలం రేపింది.
ఈ పెన్నుతో ప్రత్యేక అనుబంధం ఉన్న వారందరూ సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేయడంతో రెనాల్డ్స్ సంస్థ స్వయంగా స్పందించింది. ఆ వార్తలన్నీ అవాస్తవమని ప్రకటించింది. రెనాల్డ్స్ 045 తయారీని ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.
‘‘ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు అవాస్తవం. వీటిని చూసి ఎవరూ ఆందోళన చెందవద్దు’’ అని పేర్కొంది. అంతేకాకుండా, రెనాల్డ్స్కు సంబంధించి వాస్తవ సమాచారం కోసం సంస్థ అధికారిక వెబ్సైట్, సోషల్ మీడియా పేజీలను మాత్రమే చూడాలని విజ్ఞప్తి చేసింది. పెన్ను డిజైన్లో ఎటువంటి మార్పులు చేయమని కూడా స్పష్టం చేసింది.