DY Chandrachud: ఇంటి పనులు చేసే భర్తను వెతుక్కోమని నా మాజీ భార్యకు చెప్పారు: చీఫ్ జస్టిస్ చంద్రచూడ్

CJI DY Chandrachud recalls late exwifes law firm ordeal

  • బెంగళూరు నేషనల్ లా స్కూల్ స్నాతకోత్సవంలో ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ప్రసంగం
  • ఉద్యోగ బాధ్యతలు, వ్యక్తిగత జీవితం మధ్య సమతౌల్యం సాధించాలని విద్యార్థులకు సూచన
  • ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా తన మాజీ భార్య అనూహ్య పరిస్థితి ఎదుర్కొందన్న చీఫ్ జస్టిస్
  • సంవత్సరమంతా పనిచేయాలని, కుటుంబానికి సమయం ఉండదని ఆమెకు ఇంటర్వ్యూలో చెప్పినట్టు వెల్లడి
  • నెలసరి సమయంలో కోర్టు క్లర్కులకు తాను వర్క్ ఫ్రం హోం అనుమతి ఇచ్చానని పేర్కొన్న చీఫ్ జస్టిస్

ఉద్యోగ బాధ్యతలు, వ్యక్తిగత జీవితం మధ్య సమతౌల్యం ఉండాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. బెంగళూరులో శనివారం జరిగిన నేషనల్ లా స్కూల్ స్నాతకోత్సవంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్బంగా తన మాజీ భార్య ఒకప్పుడు వృత్తిజీవితంలో ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులను వివరించారు. ‘‘నా మాజీ భార్య ఇప్పుడు లేరు. అయితే.. ఒకప్పుడు ఆమె ఓ న్యాయసంస్థలో ఇంటర్వ్యూకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆఫీసులో పని గంటల గురించి అడిగారు. దీంతో, సంవత్సరమంతా పని చేస్తూ ఉండాలని వారు చెప్పడంతో ఆమె ఆశ్చర్యపోయారు. కుటుంబానికి ఆమె వద్ద సమయం ఉండదని కూడా తేల్చి చెప్పారు. అంతేకాకుండా, ఇంటి పనులు చేసే భర్తను వెతుక్కోమని కూడా ఆమెకు సలహా ఇచ్చారు’’ అని జస్టిస్ చంద్రచూడ్ చెప్పుకొచ్చారు. 

ప్రస్తుతం పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చిందన్న ఆయన ఓ న్యాయమూర్తిగా తానూ ఈ దిశగా కొంతమేర పాటుపడ్డానని వివరించారు. కోర్టులోని మహిళా క్లర్కులకు నెలసరి సమయంలో శారీరక సమస్యలు ఎక్కువైతే వారికి వర్క్ ఫ్రం హోంకు అనుమతి ఇచ్చానని కూడా చెప్పారు. ‘‘గతేడాది కోర్టులోని ఐదుగురు క్లర్క్‌లలో నలుగురు మహిళలే. వారు అప్పుడప్పుడు నాకు ఫోన్ చేసి నెలసరి ఇబ్బందులు ఉన్నాయని చెబుతుంటారు. వెంటనే నేను వారికి వర్క్ ఫ్రం హోంకు అవకాశం ఇచ్చి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని చెప్తాను. సుప్రీం కోర్టులోని మహిళల బాత్రూమ్‌లలో శానిటరీ నాప్కిన్‌ డిస్పెన్సర్‌ను ఏర్పాటు చేయించాను’’ అని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News