TSRTC: రాఖీ పండగకు వెయ్యి స్పెషల్ బస్సులు: టీఎస్ఆర్టీసీ
- మూడు రోజుల పాటు వివిధ రూట్లలో స్పెషల్ సర్వీసులు
- బస్ స్టేషన్లలో ప్రత్యేకంగా సిబ్బంది ఏర్పాటు
- అధికారులకు ఉత్తర్వులు జారీ చేసిన ఎండీ సజ్జనార్
రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. పండుగ నేపథ్యంలో రద్దీని నివారించేందుకు వెయ్యి స్పెషల్ బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలోని వివిధ రూట్లలో ఈ బస్సులు తిరుగుతాయని వివరించింది. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా రాష్ట్రంలోని అన్ని బస్ స్టేషన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.
ఈ నెల 29, 30, 31 తేదీలలో ప్రతీరోజూ వెయ్యి బస్సుల చొప్పున వివిధ రూట్లలో నడపనున్నట్లు సజ్జనార్ వెల్లడించారు. జంటనగరాల్లోని జేబీఎస్, ఎంజీబీఎస్, ఆరాంఘర్, ఉప్పల్, ఎల్బీనగర్ బస్ స్టేషన్లలో ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు వివరించారు. రాఖీ పౌర్ణిమ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు.