etala rajender: తుమ్మలను బీజేపీలోకి ఆహ్వానిస్తాం: ఈటల రాజేందర్
- తుమ్మల నాగేశ్వరరావును అవసరానికి వాడుకుని వదిలేశారన్న ఈటల
- బీజేపీలో చేరికపై ఆయన్ను కలిసి చర్చిస్తామని వెల్లడి
- రాష్ట్రంలో తాము అధికారంలోకి రావడం తథ్యమని ధీమా
బీఆర్ఎస్ నుంచి పాలేరు టికెట్ రాకపోవడంతో తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన ఆయన.. ఏ పార్టీలో చేరుతారనేది ఇంకా స్పష్టం చేయలేదు. కాంగ్రెస్‌లో చేరాలని అనుచరులు ఒత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ ఎన్నికల చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
తుమ్మల నాగేశ్వరరావును బీజేపీలోకి ఆహ్వానిస్తామని ఈటల చెప్పారు. ఈ విషయంలో ఆయన్ను కలిసి చర్చిస్తామని వెల్లడించారు. తుమ్మలను బీఆర్ఎస్‌లో అవసరానికి వాడుకుని వదిలేశారని ఆరోపించారు. ఆయన్ను తమ పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పుకొచ్చారు.
తెలంగాణలో రైతాంగం కష్టాల్లో ఉందని ఈటల అన్నారు. రాష్ట్ర రైతులకు బీజేపీ అండగా ఉంటుందని చెప్పారు. ఈ రోజు ఖమ్మంలో జరగబోయే బహిరంగ సభలో రైతు డిక్లరేషన్‌ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటిస్తారని వెల్లడించారు. ఈ సభ ద్వారా బీజేపీ వైఖరిని స్పష్టం చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.