CPI Narayana: మోదీకి దత్తపుత్రుడిగా జగన్: సీపీఐ నారాయణ విమర్శలు
- ఏపీలో మోదీ, జగన్ డబుల్ ఇంజిన్ పాలన సాగుతోందన్న నారాయణ
- ఎన్నో కేసుల్లో నిందితుడైన జగన్.. ఏళ్లుగా బెయిల్పై బయట ఉన్నారని వ్యాఖ్య
- స్వాతంత్ర్యం తర్వాత ఏ నిందితుడూ ఇన్నేళ్లు బెయిల్పై బయట ఉండలేదని విమర్శ
- కేసులకు భయపడి మోదీకి జగన్ లొంగిపోయారని ఆరోపణ
ఏపీ సీఎం వైఎస్ జగన్పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే కేంద్రం మెడలు వంచుతానని చెప్పిన జగన్.. కేసులకు భయపడి ప్రధాని మోదీకి లొంగిపోయారని ఆరోపించారు. ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్.. బెయిల్పై బయట ఉన్నారని విమర్శించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ నిందితుడూ ఇన్నేళ్లు బెయిల్పై బయట ఉండలేదని చెప్పారు.
సీపీఐ బస్సు యాత్ర గుంటూరుకు చేరుకున్న నేపథ్యంలో సభ నిర్వహించారు. ఈ సభలో నారాయణ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ, బీఆర్ఎస్ ముసుగులో బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వమే కొనసాగుతోందని విమర్శించారు. ‘‘నిన్న మొన్నటి దాకా మోదీపై మొరిగిన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డిని కాపాడేందుకు కేంద్రానికి జగన్ లొంగిపాయాడు. కేసీఆర్ తన కూతుర్ని లిక్కర్ స్కామ్ నుంచి బయటపడేసేందుకు బీజేపీ తొత్తుగా మారాడు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మోదీ – జగన్ డబుల్ ఇంజిన్ పాత్ర పోషిస్తున్నారని సీపీఐ నారాయణ ఎద్దేవా చేశారు. మోదీకి దత్తపుత్రుడిగా జగన్ కొనసాగుతున్నారు” అని ఎద్దేవా చేశారు. ప్రస్తుతానికి పవన్ కల్యాణ్ బీజేపీతో కలిసి అంటకాగుతున్నాడని, ఎన్నికల సమయంలో బీజేపీతో ఉంటాడా లేదా అనేది ప్రశ్నార్థకమేనని అన్నారు.
మరోవైపు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య జరిగి నాలుగేళ్ల గడిచినా ఇప్పటికీ ఈ కేసు తేలలేదని విమర్శించారు. పులివెందులకు వెళ్లి చిన్న పిల్లాడిని అడిగినా వివేకాను హత్య చేసింది ఎవరనే విషయం చెబుతారని అన్నారు. సీబీఐ మాత్రం ఇంకా విచారణ కొనసాగిస్తుండటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.