Jaipur: గుడి వద్ద రూ.10 వేల ఖరీదైన షూస్ చోరీ.. న్యాయమూర్తి పోలీస్ కంప్లైంట్
- కుటుంబంతో కలిసి జైపూర్లోని ఓ దేవాలయానికి వెళ్లిన పోక్సో కోర్టు న్యాయమూర్తి
- జడ్జి కుమారుడు గుడి మెట్ల వద్ద విడిచి వెళ్లిన బూట్ల చోరీ
- పోలీసులకు ఫిర్యాదు చేసిన న్యాయమూర్తి, తక్షణ చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి
గుడి మెట్ల వద్ద విడిచిన ఖరీదైన బూట్లు చోరీ కావడంతో ఓ న్యాయమూర్తి పోలీసులను ఆశ్రయించారు. రాజస్థాన్లో ఈ ఘటన వెలుగు చూసింది. ఆళ్వార్కు చెందిన పోక్సో కోర్టు న్యాయమూర్తి జితేంద్ర కుమార్ అగ్రవాల్ ఈ నెల 20న తన కుటుంబంతో కలిసి జైపూర్లోని బ్రజ్నిధి దేవాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు తన పది వేల రూపాయల రీబాక్ బూట్లను గుడి మెట్ల వద్ద విడిచి లోపలికి వెళ్లాడు.
ఆ తరువాత బయటకు వచ్చి చూస్తే షూస్ కనిపించలేదు. దీంతో, న్యాయమూర్తి మణక్ చౌక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ కేసును త్వరగా పరిష్కరించాలంటూ పోలీసులపై ఒత్తిడి పెరిగినట్టు తెలుస్తోంది.