BRS: రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే: దానం నాగేందర్
- కాంగ్రెస్, బీజేపీలకు కాలంచెల్లిందన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే
- తెలంగాణ ప్రభుత్వ స్కీములను మిగతా రాష్ట్రాల్లో అమలు చేయగలరా అంటూ సవాల్
- ఎన్ని డిక్లరేషన్లు పెట్టినా బీఆర్ఎస్ గెలుపును అడ్డుకోలేరని ధీమా
తెలంగాణలో ముచ్చటగా మూడోసారి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఏర్పడుతుందని బీఆర్ఎస్ పార్టీ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ మరోమారు ముఖ్యమంత్రి పదవి చేపడతారని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు కాలం చెల్లిందన్నారు. ఆ పార్టీలు ఇచ్చే హామీలను, నేతలు చెప్పే మాటలను రాష్ట్ర ప్రజలు నమ్మరని చెప్పారు. తెలంగాణలో తమ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో అమలుచేసి చూపాలని సవాల్ విసిరారు. ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద నాయకులు వచ్చి హైదరాబాద్ లో ప్రగల్భాలు పలుకుతున్నారని దానం నాగేందర్ విమర్శించారు. ఎవరు ఎన్ని డిక్లరేషన్లు పెట్టినా బీఆర్ఎస్ గెలుపును అడ్డుకోలేరని స్పష్టం చేశారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలంగాణ ప్రజలకు తెలుసని దానం నాగేందర్ చెప్పారు. ముందు ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుని, వాటిని చక్కదిద్దే మార్గం చూడాలని ప్రతిపక్ష నేతలకు ఎమ్మెల్యే హితవు పలికారు. ఈమేరకు ఆదివారం ఖైరతాబాద్ నియోజకవర్గంలోని పీజేఆర్ నగర్ లో పెద్ద సంఖ్యలో యువత బీఆర్ఎస్ లో చేరారు. దానం నాగేందర్ వారికి పార్టీ కండువా కప్పి స్వాగతించారు.