bogus votes: 10 లక్షల బోగస్ ఓట్లు.. అందులో సగం హైదరాబాద్ లోనే
- కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్ పరిధిలో ఎక్కువ
- మెజారిటీ బోగస్ ఓట్లు హైదరాబాద్ చుట్టూనే ఉన్నట్టు గుర్తింపు
- ఓట్ల తొలగింపునకు సరైన విధానం పాటిస్తామన్న ఎన్నికల సంఘం
తెలంగాణ వ్యాప్తంగా 10 లక్షల బోగస్ ఓట్లను ఎన్నికల సంఘం తొలగించగా.. ఇందులో మెజారిటీ ఓట్లు హైదరాబాద్, దాని చుట్టు పక్కల నియోజకవర్గాల్లోనే కేంద్రీకృతమయ్యాయి. నకిలీ ఓట్లు ఎక్కువగా కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, ఎల్బీ నగర్ నియోజకవర్గాల పరిధిలోనే వెలుగు చూశాయి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 50వేల దొంగ ఓట్లు బయటపడ్డాయి.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్ గిరి, కరీంనగర్, నిజామాబాద్ అర్బన్ లో ఎక్కువ నకిలీ ఓట్లను గుర్తించినట్టు ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ దీనిపై వివరాలు వెల్లడించారు. ‘‘ఎలక్టోరల్ జాబితా నుంచి తొలగించడానికి కొన్ని ప్రధాన అంశాలను పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. ఒకే పేరుతో ఒకటికి మించిన ఓట్లు, ఒకే పేరు మాదిరిగా ఉండడాన్ని సిస్టమ్ గుర్తించడం లేక వ్యక్తులు, అధికారులు, రాజకీయ పార్టీలు మా దృష్టికి తీసుకువచ్చిన సందర్భాల్లో.. అప్పుడు ఓటరు పేరు, వయసు, జెండర్, చిరునామా ఒకే రకంగా ఉన్నాయా? లేక భిన్నంగా ఉన్నాయా? అన్నది చెక్ చేస్తాం.
ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ అయిన ఓటర్లు ఫామ్ 8 రూపంలో బదిలీకి దరఖాస్తు చేసుకోవాలి. కొత్త ప్రాంతంలో ఓటరు పేరు చేర్చినప్పుడే, పాత ప్రాంతంలోనూ వారి పేరు తొలగించడం జరుగుతుంది. నకిలీ ఓట్ల తొలగింపునకు ఒక సరైన విధానాన్ని అనుసరిస్తాం’’అని వికాస్ రాజ్ వివరించారు.