kethireddy pedda reddy: రోజంతా టైమిస్తున్నా... నన్ను చంపుతావా?: జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- మాట్లాడితే చంపుతాం.. నరుకుతామని అరుస్తున్నాడని కేతిరెడ్డి ధ్వజం
- రోజంతా ఒకే గదిలో ఉందామని, అప్పుడు దమ్ముంటే చంపాలని సవాల్
- వచ్చే ఎన్నికలు అయ్యే వరకు ఆయనను తన్నేది లేదని సెటైర్
టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడితే చంపుతాం.. నరుకుతామని అరుస్తున్నాడని, దమ్ముంటే నన్ను చంపాలని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సవాల్ చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... ఒకరోజంతా మనమిద్దరం ఒకే గదిలో ఉందామని, రోజాంతా సమయం ఇస్తానని, అప్పుడు దమ్ముంటే తనను చంపాలని సవాల్ చేశారు. అడుగు తీసి అడుగు వేయలేని ప్రభాకర్ రెడ్డి బెదిరింపులు హాస్యాస్పదమని, రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. గతంలో తాను ఆయన ఇంటికి వెళ్తే ఎమ్మెల్యే అయ్యారని, మళ్లీ తనను రెచ్చగొట్టడం ద్వారా తన్నించుకొని కొడుకును గెలిపించుకుందామనుకుంటున్నారని, కానీ వచ్చే ఎన్నికలు అయ్యే వరకు ఆయనను తన్నేది లేదని సెటైర్లు వేశారు.
తాడిపత్రిలో తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎవరో తెలియక ఆ పార్టీ కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారని ఎద్దేవా చేశారు. తాడిపత్రి టీడీపీ ఇంఛార్జ్ జేసీ అస్మిత్ రెడ్డి వీకెండ్ పొలిటీషియన్ అని, ఉనికి కోసమే తాడిపత్రిలో హడావుడి చేస్తున్నారన్నారు. ప్రభాకర్ రెడ్డి కుటుంబం గద్వాలలో దొంగతనాలు చేసి తాడిపత్రికి వలస వచ్చారన్నారు. జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ వ్యవహారం తమిళనాడు, ఛత్తీస్గఢ్లలోను ఉందన్నారు. త్వరలో ఆయా రాష్ట్రాల్లో కేసులు నమోదు చేస్తారన్నారు.
బీఎస్ 3 వాహనాలను స్కార్ప్ కింద కొనుగోలు చేసి నాగాలాండ్‌లో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించిన దారుణమైన చరిత్ర ప్రభాకర్ రెడ్డిది అని ఆరోపించారు. తనను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ, ఆ సానుభూతితో కొడుకును గెలిపించుకుందామని భావిస్తున్నాడన్నారు. జేసీ కుటుంబానికి చిత్తశుద్ధి ఉంటే త్రిశూల్ సిమెంట్ వ్యవహారంలో ప్రభుత్వం విధించిన రూ.100 కోట్ల జరిమానాను చెల్లించాలని డిమాండ్ చేశారు.