KA Paul: చెప్పినట్టే చేసిన కేఏ పాల్... ఆమరణ దీక్ష ప్రారంభం
- విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం కేఏ పాల్ పోరాటం
- ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్
- లేకపోతే సోమవారం నుంచి ఆమరణ దీక్షకు దిగుతానని హెచ్చరిక
- వైజాగ్ లో కన్వెన్షన్ సెంటర్ దీక్ష ప్రారంభించిన కేఏ పాల్
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని సోమవారం లోపు వెనక్కి తీసుకోవాలంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కేంద్రానికి డెడ్ లైన్ విధించిన సంగతి తెలిసిందే. స్టీల్ ప్లాంట్ ను అమ్మబోమంటూ కేంద్రం అధికారిక ప్రకటన చేయాలని, లేకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని కేఏ పాల్ హెచ్చరించారు.
కేఏ పాల్ విధించిన గడువు నేటితో ముగియగా, ఆయన తన మాట నిలబెట్టుకున్నారు. సోమవారం నాడు వైజాగ్ లోని కన్వెన్షన్ సెంటర్ లో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. విశాఖ ఉక్కు కోసం ప్రాణాలిచ్చేందుకైనా సిద్ధమేనని పాల్ స్పష్టం చేస్తున్నారు.
కాగా, ఆయన నిరాహార దీక్ష సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు, విశాఖ పార్లమెంటు స్థానం అభ్యర్థి డాక్టర్ కేఏ పాల్ అని పేర్కొన్నారు. దీన్నిబట్టి ఆయన వచ్చే ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేస్తారని తెలుస్తోంది.