China: తీరు మార్చుకోని చైనా.. అరుణాచల్ ను తమ అంతర్భాగంగా చూపిస్తూ మ్యాప్
- సోమవారం అధికారికంగా మ్యాప్ విడుదల చేసిన డ్రాగన్ కంట్రీ
- తైవాన్ తో పాటు సౌత్ చైనా సముద్రం కూడా తమదేనని వాదన
- అరుణాచల్ ప్రదేశ్ ఎన్నటికీ భారత భూభాగమేనని స్పష్టం చేసిన కేంద్రం
చైనా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. భారత్ లోని అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్ భూభాగాలను తమ అంతర్భాగంగా చూపిస్తూ కొత్త మ్యాప్ విడుదల చేసింది. 2023 ఏడాదిలో ఎడిషన్ పేరుతో ఈ కొత్త మ్యాప్ ను చైనా తన అధికారిక వెబ్ సైట్ లో పొందుపరిచింది. భారత భూభాగాలతో పాటు తైవాన్ ను, సౌత్ చైనా సముద్రాన్నీ మ్యాప్ లో పొందుపరిచింది. ఈ వివరాలను డ్రాగన్ కంట్రీ అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ ఓ ట్వీట్ లో వెల్లడించింది.
తైవాన్ తమ భూభాగమేనని చైనా వాదిస్తోంది. ఈ విషయంలో ఇటీవల ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. తైవాన్ ద్వీపం చుట్టూ ఇటీవల నేవీ షిప్ లతో చైనా డ్రిల్స్ నిర్వహించింది. మరోవైపు, సౌత్ చైనా సముద్రంలో తమకూ వాటా ఉందంటూ వియత్నాం, ఫిలిప్పీన్, మలేసియా, బ్రూనై, తైవాన్ వాదిస్తున్నాయి. అయితే, ఈ దేశాల వాదనలను చైనా ఎప్పటిలాగే తోసిపుచ్చుతూ.. తాజాగా విడుదల చేసిన మ్యాప్ లో సౌత్ చైనా సముద్రాన్ని చైనాలో అంతర్భాగంగా చూపించింది. ఇక అరుణాచల్ ప్రదేశ్ ఎన్నటికీ భారత భూభాగమేనని కేంద్రం పదే పదే చెబుతున్నా చైనా మాత్రం తీరు మార్చుకోవడంలేదు.