Baldia: బల్దియా కాంట్రాక్టర్ల జీహెచ్ఎంసీ ముట్టడి.. ఆఫీసు ముందు ఉద్రిక్తత
- పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయాలంటూ కాంట్రాక్టర్ల డిమాండ్
- కుటుంబ సభ్యులతో కలిసి జీహెచ్ఎంసీ ముందు ఆందోళన
- అడ్డుకున్న పోలీసులు.. కాంట్రాక్టర్ల అరెస్టు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ప్రధాన కార్యాలయం ముందు ఉద్రిక్తత నెలకొంది. బల్దియా కాంట్రాక్టర్ల ఆందోళన నేపథ్యంలో పెద్ద సంఖ్యలో పోలీసులు జీహెచ్ఎంసీ ఆఫీసు వద్దకు చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న కాంట్రాక్టర్లను చెదరగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలన్న డిమాండ్ తో బల్దియా కాంట్రాక్టర్లు జీహెచ్ఎంసీ ముట్టడికి పిలుపునిచ్చారు. దాదాపు రూ. వెయ్యి కోట్ల విలువైన బిల్లులను జీహెచ్ఎంసీ పెండింగ్ లో పెట్టిందని ఆరోపించారు.
పనులు పూర్తి చేసినా బిల్లులు రాకపోవడంతో తాము ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులతో సహా మంగళవారం జీహెచ్ఎంసీ కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి కాంట్రాక్టర్లకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో కాంట్రాక్టర్లను అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు.