Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ పాలకుడికి ఎలాగూ తెలుగు అంటే ఆసక్తి లేదు... భాషను ప్రజలే కాపాడుకోవాలి: పవన్ కల్యాణ్

Pawan Kalyan hails Gidugu on Telugu language day

  • నేడు తెలుగు భాషా దినోత్సవం
  • గిడుగు వెంకటరామమూర్తికి అంజలి ఘటించిన పవన్ కల్యాణ్
  • మాతృభాషకు జీవం పోసిన వ్యక్తి  గిడుగు అంటూ కొనియాడిన వైనం
  • పాలకుల తీరు మాతృభాషను దూరం చేసే విధంగా ఉందని విమర్శలు

నేడు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఓ ప్రకటన ద్వారా స్పందించారు. తెలుగు భాషను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చారు. 

మాట్లాడే భాష, రాసే భాష ఒకటి కావాలని తపించి, ఆ దిశగా వ్యావహారిక భాషోద్యమాన్ని నడిపిన గిడుగు వెంకటరామమూర్తి గారిని తెలుగు జాతి ఎన్నడూ మరువకూడదని తెలిపారు. గ్రాంథిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల భాషలోకి తీసుకువచ్చి మన మాతృ భాషకు జీవం పోసిన వ్యక్తి గిడుగు అని కొనియాడారు. నేడు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గిడుగు వెంకటరామమూర్తి గారికి అంజలి ఘటిస్తున్నానని వివరించారు. 

"ఆంధ్రప్రదేశ్ పాలకుడికి ఎలాగూ తెలుగు అంటే ఆసక్తి లేదు. కాబట్టి ప్రజలే తెలుగు భాషను కాపాడుకునే బాధ్యతను స్వీకరించాలి. తెలుగు భాష అభివృద్ధి కోసం ఏర్పాటైన ప్రభుత్వ విభాగాల పనితీరును గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత  మంచిది. వారు విడుదల చేసే ప్రకటనల్లోనూ, విద్యాశాఖ నుంచి వచ్చే ప్రకటనల్లోనూ ఎన్ని అక్షర దోషాలు ఉంటున్నాయో చూస్తేనే తెలుస్తుంది. అలాంటి వారి నుంచి భాషా వికాసాన్ని ఆశించలేం. 

వ్యావహారిక భాషోద్యమానికి మూల పురుషుడైన గిడుగు వెంకటరామమూర్తి గారి స్ఫూర్తిని తెలుగు భాషాభిమానులు, అధ్యాపకులు, సాహితీవేత్తలు అందిపుచ్చుకోవాలి. చిన్నారులు ఓనమాలు నేర్చుకునే దశ నుంచే మన మాతృభాషను దూరం చేసే విధంగా ఉన్న పాలకుల తీరు వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి" అని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News