Asia Cup: రేపటి నుంచి ఆసియా కప్... తొలి మ్యాచ్ లో పాకిస్థాన్, నేపాల్ ఢీ

Asia Cup cricket tourney will start from tomorrow

  • ఆసియా కప్ టోర్నీకి సర్వం సిద్ధం
  • ఆగస్టు 30 నుంచి సెప్టెంబరు 17 వరకు టోర్నీ
  • టోర్నీకి ఆతిథ్యమిస్తున్న పాకిస్థాన్, శ్రీలంక 
  • ఒకే గ్రూప్ లో ఉన్న భారత్, పాక్ జట్లు

ఆసియా కప్ క్రికెట్  సమరానికి సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి ఆసియా స్థాయిలో మెగా టోర్నీ జరగనుంది. తొలి మ్యాచ్ లో పాకిస్థాన్, నేపాల్ తలపడనున్నాయి. పాకిస్థాన్  లోని ముల్తాన్ ఈ మ్యాచ్ కు వేదికగా నిలవనుంది. 

పాక్ సారథి బాబర్ అజామ్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. బాబర్ ఈ ఏడాది 11 వన్డేల్లో 6 అర్ధసెంచరీలు, 1 సెంచరీతో సత్తా చాటాడు. అటు, నేపాల్ లెగ్ స్పిన్నర్ సందీప్ లామిచానే 2021 నుంచి ఇప్పటివరకు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా కొనసొగుతున్నాడు. 2021 నుంచి లామిచానే 88 వికెట్లు తీయడం విశేషం. పాకిస్థాన్, నేపాల్ జట్లు పరస్పరం తలపడడం ఇదే ప్రథమం.

పాకిస్థాన్, శ్రీలంక ఆతిథ్యమిస్తున్న ఆసియా కప్ టోర్నీలో మొత్తం 6 జట్లు తలపడుతున్నాయి. భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, నేపాల్ జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి ఆడనున్నాయి. గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్, నేపాల్... గ్రూప్-బీలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు ఉన్నాయి. 

రెండు గ్రూపుల నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన 4 జట్లు సూపర్-4 దశకు చేరుకుంటాయి. ఈ దశలో ప్రతి జట్టు మూడేసి మ్యాచ్ లు ఆడుతుంది. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్ కు అర్హత పొందుతాయి. సెప్టెంబరు 17న కొలంబోలో ఫైనల్ జరగనుంది. 

కాగా, గ్రూప్-ఏలో భారత్ తన ప్రస్థానాన్ని సెప్టెంబరు 2న ప్రారంభించనుంది. భారత్ తన తొలి మ్యాచ్ లోనే చిరకాల ప్రత్యర్థి పాక్ ను ఎదుర్కొంటుండడంతో ఈ మ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

  • Loading...

More Telugu News