Mallikarjun Kharge: మోదీ సర్కారు గ్యాస్ ధర తగ్గించడంపై ఖర్గే స్పందన
- సాధారణ సిలిండర్ పై రూ.200 తగ్గింపు
- ఉజ్వల పథకంలోని వారికి రూ.400 తగ్గింపు
- ఎన్నికలప్పుడే బీజేపీకి కానుకలు గుర్తొస్తాయన్న ఖర్గే
- ఇది ఎన్నికల లాలీపాప్ అంటూ విమర్శలు
కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ల ధరలు తగ్గించడం తెలిసిందే. సాధారణ సిలిండర్ పై రూ.200, ఉజ్వల పథకం కింద సిలిండర్ పొందేవారికి రూ.400 తగ్గింపు ప్రకటించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు.
ఈ సమయంలో గ్యాస్ సిలిండర్ ధర తగ్గించడాన్ని ఎన్నికల తాయిలంగానే భావించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇదొక ఎన్నికల లాలీపాప్ అని అభివర్ణించారు. బీజేపీకి ఓట్లు తగ్గుతుండడంతో ఎన్నికల కానుకల పంపిణీ మొదలైందని ఖర్గే ఎద్దేవా చేశారు.
ద్రవ్యోల్బణం కారణంగా సామాన్యు పౌరుడు చితికిపోతున్నప్పుడు ఏ కానుకలు ఇవ్వాలని మీకు గుర్తుకురాలేదా? రూ.200 రాయితీతో దేశ ప్రజల ఆగ్రహాన్ని తగ్గించగలమనుకుంటున్నారా? అంటూ ఖర్గే మోదీ సర్కారును సూటిగా ప్రశ్నించారు.
రూ.400గా ఉన్న సిలిండర్ ధరను గత తొమ్మిదేళ్లలో రూ.1,100కి పెంచింది బీజేపీ ప్రభుత్వమేనన్న సంగతి గుర్తించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్ లో రూ.500కే సిలిండర్ అందిస్తున్నామని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఈ భారీ తగ్గింపును అమలు చేస్తామని వెల్లడించారు.