Vijayasai Reddy: మధ్య తరగతి ప్రజలకు ఈ నిర్ణయం ఓ వరం: గ్యాస్ ధర తగ్గింపుపై విజయసాయిరెడ్డి
- గ్యాస్ సిలిండర్ ధర తగ్గించిన కేంద్రం
- సాధారణ సిలిండర్ పై రూ.200 తగ్గింపు
- ఉజ్వల్ పథకం సిలిండర్లపై రూ.400 తగ్గింపు
- కోట్లాది మంది ప్రజలకు డబ్బును ఆదా చేస్తుందన్న విజయసాయి
గృహోపయోగ గ్యాస్ సిలిండర్ల ధరను తగ్గిస్తూ కేంద్రం నిన్న ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. సాధారణ సిలిండర్ ధరపై రూ.200, ఉజ్వల్ పథకం గ్యాస్ సిలిండర్లపై రూ.400 తగ్గిస్తున్నట్టు కేంద్రం పేర్కొంది. ఇది రక్షా బంధన్ పర్వదినం నేపథ్యంలో ప్రధాని మోదీ దేశ మహిళలకు ఇస్తున్న కానుక అని అభివర్ణించింది.
దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. గృహ వినియోగదారులు ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్ల ధరను రూ.200 మేర తగ్గించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయాన్ని వైసీపీ స్వాగతిస్తోందని తెలిపారు.
మోదీ తీసుకున్న ఈ నిర్ణయం కోట్లాది మంది ప్రజలకు డబ్బును ఆదా చేస్తుందని, ఆ డబ్బును ఇతర అవసరాలకు ఉపయోగించుకునేలా ఈ నిర్ణయం తోడ్పడుతుందని విజయసాయి వివరించారు. పెద్ద సంఖ్యలో ఉన్న మధ్య తరగతి ప్రజలకు ఈ నిర్ణయం ఓ వరంలాంటిదని అభివర్ణించారు.