Google Flights: తక్కువ ధరకే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవాలా..? గూగుల్ కొత్త ఫీచర్ ట్రై చేయండి!
- విమాన ప్రయాణికుల కోసం కొత్త ఫీచర్ తెచ్చిన గూగుల్
- టికెట్ బుకింగ్ విషయంలో సలహాలు, సూచనలు
- టికెట్ ధరలు తగ్గినపుడు అలర్ట్ చేసే ఏర్పాటు
తక్కువ ఖర్చుతో విమానయానం చేసే అవకాశం కల్పించేందుకు గూగుల్ సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫ్లైట్ టికెట్ ను తక్కువ ధరకే బుక్ చేసుకునేందుకు ఈ ఫీచర్ సాయపడుతుందని పేర్కొంది. మీరు వెళ్లాల్సిన ప్రదేశానికి ఏ సమయంలో టికెట్ రేట్లు తక్కువగా ఉంటాయనే వివరాలతో పాటు బుకింగ్ విషయంలో సలహాలు, సూచనలు చేసేలా దీనిని తీర్చిదిద్దినట్లు వెల్లడించింది. గూగుల్ తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచరే ‘గూగుల్ ఫ్లైట్స్’.
ఫ్లైట్ టికెట్ ధరలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. డిమాండ్ ను బట్టి మారుతుంటాయి. ముఖ్యంగా అర్జెంటుగా ప్రయాణించాల్సి వస్తే టికెట్ కోసం భారీ మొత్తమే వెచ్చించాల్సి ఉంటుంది. అందుకే ముందస్తుగా టికెట్ బుక్ చేసుకోవడం ద్వారా తక్కువ మొత్తానికే ప్రయాణం పూర్తి చేయొచ్చు. ఈ విషయం దాదాపుగా అందరికీ తెలిసిందే. ఇక మీరు ప్రయాణం చేయాలని అనుకుంటున్న రూట్ లో ఏయే సమయాల్లో ధరలు తక్కువగా ఉంటాయనేది గూగుల్ ఫ్లైట్స్ ద్వారా తెలుసుకోవచ్చు. అంతేకాదు, ఇతరత్రా ప్రత్యేక సందర్భాలలో టికెట్ ధరలు తగ్గినపుడు మిమ్మల్ని అలర్ట్ చేస్తుందని గూగుల్ కంపెనీ పేర్కొంది.
వివిధ రూట్లలో గతంలో టికెట్ ధరలు ఎలా ఉన్నాయనేది గూగుల్ ఫ్లైట్స్ విశ్లేషించి, ఆ సమాచారంతో టికెట్ బుకింగ్ ఎప్పుడు చేసుకుంటే ఆర్థికంగా ప్రయోజనం పొందవచ్చనే విషయం తెలియజేస్తుంది. ఇక క్రిస్మస్ లాంటి రద్దీ సమయాల్లో కనీసం 71 రోజుల ముందు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటే తక్కువ ధరకే టికెట్ పొందే అవకాశం ఉంటుందని గూగుల్ ఫ్లైట్స్ సూచిస్తోంది. కొన్ని ప్రత్యేక సందర్భాలలో నిర్దేశించిన రూట్ లో ప్రయాణించేటపుడు చివరి నిమిషంలో (టేకాఫ్ కు ముందు) టికెట్ ధరలు తగ్గే అవకాశం ఉంటుందని పేర్కొంది. ఇలా వివిధ సందర్భాలలో ఫ్లైట్ టికెట్ ధరల్లో వచ్చే హెచ్చుతగ్గుల గురించి ప్రయాణికులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తుందని గూగుల్ కంపెనీ తెలిపింది.