rajaiah: నా పని ఇప్పుడే అయిపోయిందని భావించవద్దు: ఎమ్మెల్యే రాజయ్య వ్యాఖ్యలు
- టిక్కెట్ రాకపోయినా ప్రజాక్షేత్రంలోనే ఉంటానన్న ఎమ్మెల్యే
- ఎన్నికలకు మరో మూడు నెలల సమయం ఉందని కీలక వ్యాఖ్య
- ఎవరో వచ్చి ఏదో చేస్తారని అనుకోవద్దని హితవు
- ఏదో జరుగుతుందని ఊహించవద్దన్న రాజయ్య
తనకు టిక్కెట్ రాకపోయినా ప్రజాక్షేత్రంలోనే ఉంటానని, ఎన్నికలకు మరో మూడు నెలల సమయం ఉందని, ఎవరో వచ్చి ఏదో చేస్తారని అందరూ అనుకుంటున్నారని, కానీ ఎవరూ రారు.. ఏమీ జరగదని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే టీ రాజయ్య అన్నారు. బుధవారం లింగాలఘనపురం మండలంలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అయితే ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి బీఆర్ఎస్ స్థానిక నాయకులు గైర్హాజరయ్యారు. దీంతో రాజయ్య నేతల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తన పని ఇప్పుడే అయిపోయిందని భావించవద్దని, ఏదో జరుగుతుందని ఊహించవద్దని వ్యాఖ్యానించారు.
ఇటీవల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 119 నియోజకవర్గాలకు గాను 115 మంది అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం ఏడు స్థానాల్లో అభ్యర్థులను మార్చారు. అందులో స్టేషన్ ఘన్ పూర్ కూడా ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యను కాదని కడియం శ్రీహరికి టిక్కెట్ కేటాయించారు. దీంతో రాజయ్య తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అయినప్పటికీ తాను కేసీఆర్ వెంటే నడుస్తానని ఆయన ప్రకటించడం గమనార్హం.